మొన్నటి వరకూ అందరకీ టీ, కాఫీలు అలవాటుండేవి..ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇష్టం ఉన్నా లేకపోయినా గ్రీన్‌టీకి అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం కార్యాలయాల్లో, ఇళ్లలో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో కూడా గ్రీన్ టీకి డిమాండ్ పెరిగింది. కొందరు రెగ్యులర్ గా తాగితే మరికొందరు టేస్ట్ చూద్దాం అనుకుని సిప్ చేసి ఉంటారు. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే డైట్ పాటించేవారు రోజువారీ మెనూలో గ్రీన్ టీని భాగంగా చేసుకుంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది, సన్నబడతాము అనే ఆలోచనతో ఎప్పుడంటే అప్పుడు తాగేయకూడదు. గ్రీన్ టీ తాగడానికి కూడా ఓ సమయం ఉంటుందంటారు ఆరోగ్య నిపుణులు
గ్రీన్ టీ తాగితే ప్రయోజనాలివే
- గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు
- గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి
- గ్రీన్ టీ తాగడం వల్ల మీ మెదుడు చురుగ్గా పనిచేస్తుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి
- గ్రీన్ టీలో ఉండే పాలీ ఫెనాల్స్ మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. స్కిన్ తొందరగా ముడతలు పడకుండా ఉండేలా చేస్తాయి
- గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బీపీ ఆదుపులో ఉంటుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది
గ్రీన్ టీ ఎప్పుడెప్పుడు తాగకూడదు
- గ్రీన్ టీ ఎప్పుడు తాగినా ఆరోగ్యకరమే అనుకుంటారు కానీ..భోజనం చేశాక తాగకూడదు. ఎందుకంటే ఆహారం అందిన తర్వాత ప్రొటీన్లు జీర్ణమయ్యే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు గ్రీన్ టీ తాగితే ఆ ప్రక్రియకు భంగం కలుగుతుంది. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
- కొందరికి టీ వేడివేడిగా తాగడం అలవాటు..మామూలు టీ వేడిగా తాగడం మంచిదే కనీ గ్రీన్ టీ మాత్రం వేడివేడిగా తాగకూడదట. వేడిగా ఉన్నప్పటి కన్నా గోరువెచ్చగా అయ్యాక తాగితే ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి
- కొందరు పరగడుపునే గ్రీన్ టీ తాగుతారు. ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ టీలో యాంటీ ఆక్సిండెంట్లు, పాలఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఖాళీ పొట్టతో దీన్ని తాగడం వల్ల ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయి జీర్ణక్రియ దెబ్బతింటుంది. టిఫిన్ తిన్నాక, భోజనానికి ముందు తాగడం మంచిదే
- గ్రీన్ టీ అదోరకంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది తేనె కలుపుకుని తాగుతారు. ఇది మంచిదే కానీ గ్రీన్ టీ వేడిగా ఉన్నప్పుడు తేనె కలపకూడదు..ఇలా చేస్తే అందులో పోషకాలు నశిస్తాయి..గోరువెచ్చని గ్రీన్ టీలో తేనె కలుపుకోవచ్చు
- పొద్దున్నే మందులు వేసుకునే సమయంలో గ్రీన్ టీ తాగడం అస్సలు మంచిదికాదు. ట్యాబ్లెట్లు గ్రీన్ టీతో కలిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. నీటితోనే ట్యాబ్లెట్స్ వేసుకోవడం మంచిది.
- ఆరోగ్యానికి మంచిదే కదా అని అధికంగా తాగకూడదు. రోజుకి రెండు సార్లు తాగడం వరకూ ఓకే. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలతోపాటు ఆందోళన కలిగిస్తుంది. మితంగా వాడితేనే ఏదైనా మంచి ఫలితాన్నిస్తుందని గుర్తుంచుకోవాలి.
- గ్రీన్ టీని ఎప్పుడూ రిలాక్స్ మూడ్ లో తాగాలి కానీ కంగారులో తొందరతొందరగా తాగితే దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు శూన్యం.
- రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎలాంటి సందేహాలున్నా మీరు వైద్యులను సంప్రదించాలి. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటారన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం