ఏపీ బీజేపీ సీట్లెన్ని, ఏయే స్థానాలు ? – ఈ గందరగోళం ఎందుకు ?

ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరింది. సీట్లు కేటాయించారు. ఆరు పార్లమెంట్, పది అసంబ్లీ స్థానాలని చెబుతున్నారు. కానీ ఇంత వరకూ ఫలానా స్తానాలన్న విషయం బ యటకు రాలేదు. స్థానాలో క్లారిటీ లేదు. అభ్యర్థులెవరో స్పష్టత లేదు. దీంతో బీజేపీలోనే కాదు.. కూటమిలోనూ సందిగ్ధం కనిపిస్తోంది. అన్నీ పక్కాగా జరిగిపోయే బీజేపీలో ఎందుకింత గందరగోళం అన్న ప్రశ్న వస్తోంది.

ఏయే స్థానాల్లో పోటీ చేస్తున్నారో అధికారిక ప్రకటన ఎందుకు ఆలస్యం ?

సీట్ల సర్దుబాటు పూర్తయిపోయిందని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థులను ప్రకటించారు. పవన్ కల్యాణ్ కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు. కానీ బీజేపీ విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. ముందు స్థానాలేవో స్పష్టంగా ప్రకటిస్తే ఆ తర్వాతక అభ్యర్థుల అంశంపై తేల్చుకుంటారు. కానీ అలాంటి ప్రయత్నమే జరగకపోవడం బీజేపీ క్యాడర్ ను ఇబ్బంది పెడుతోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసిందని.. ఇంక యాభై రోజుల్లో పోలింగ్ జరగనున్న సమయంలో నిర్ణయాలలో వేగం ఉండాలని అనుకుంటున్నారు.

ప్రజల్లో ఉన్న సీనియర్ నేతలకు అవకాశం దక్కుతుందా ?

ఏపీ బీజేపీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. కానీ బీజేపీ కోసమే పని చేసే వారు తక్కువగా ఉన్నారు. అలాంటి వారందరికీ పోటీ చేసే అవకాశం లభించాలని క్యాడర్ కోరుకోవడం సహజమే. కానీ ఎంత మందికి పోటీ చేసే చాన్స్ వస్తుందన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. టిక్కెట్లు ప్రకటించేది కేంద్ర ఎన్నికల కమిటీ అయినా రాష్ట్రం నుంచి వెళ్లే సిఫార్సులే కీలకం. అలాంటి సిఫార్సుల్లో ఆలస్యం జరుగుతోంది.

పార్టీ నేతలైనా స్పష్టమైన సమాచారం అందుతోందా ?

ఏపీ బీజేపీలో కొంత కాలంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా చోటు చేసుకుంటోంది. పార్టీ కార్యక్రమాలపైనా తమకు సమాచారం ఉండటం లేదని సీనియర్లు ఫీలవుతున్నారు . ఎన్నికల సమయంలో ఇలాంటివి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన వినిపిస్తోంది. సీనియర్ నేతలంతా కలిసి ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన అన్ని సీట్లలో గెలిపించాలని కోరుకుంటున్నారు. అలా జరగాలంటే… పరిస్థితులు వేగంగా మారాల్సి ఉంది.