బీఆర్ఎస్ నేతల డర్టీ పాలిటిక్స్ – సొంత నేతలపై హైకమాండ్ కుట్ర ?

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఊరికొక రసికలీలల నాయకుడు బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకూ లేని ఈ రసిక రాజకీయం ఇప్పుడే ఎందుకా అన్నది చాలా మందికి డౌట్ వస్తున్న అంశం . త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. టిక్కెట్లు ఇవ్వకూడదనుకున్న వారిని.. ఎగ్గొట్టాలనుకున్న వారిని ఇలా టార్గెట్ చేస్తున్నారన్న అనుమానాలు ఎక్కువ మందిలో కలుగుతున్నాయి.

హైదరాబాద్ లో సీనియర్ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఎగ్గొట్టేందుకు ఆడియో లీక్ !

మంగళవారం హైదరాబాద్‌లోని ఓ సీనియర్ ఎమ్మెల్యేలపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో యువ మహిళా కార్పొరేటర్ ను ఓ సీనియర్ ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు గురి చేసిన అంశం సంచలనంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో.. కార్పొరేటర్ ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇలా ఓ సీనియర్ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని మీడియాకు తెలిపాయి బీఆర్ఎస్ వర్గాలు. తమ పార్టీకి ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ఇలా ఎందుకు చేశాయన్నదాంట్లోనే అసలు రాజకీయం ఉందని భావిస్తున్నారు.

దుర్గం చిన్నయ్య, తాటికొండ రాజయ్యకూ అవే సిగ్నల్స్

ఇక తాటికొండ రాజయ్య గురించి చెప్పాల్సిన పని లేదు. సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తర్వాత ఆమెతో రాజీ చేసుకున్నారు . కానీ రాజయ్య మాట తప్పారని మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇలాంటి వ్యవహారాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయనపై ఆరోపణలతో.. నియోజవర్గం మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. మరో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విషయంలో.. శేజల్ అనే మహిళ చేస్తున్న ఆరోపణలు .. ఢిల్లీ దాకా వెళ్లాయి.

వాళ్లందరికీ టిక్కెట్లు ఎగ్గొట్టాడానికే ప్లాన్ చేశారా ?

గాసిప్స్ రూపంలో జిల్లాల్లో ఇలాంటివి కొంత మందిపై ఎక్కువగానే ప్రచారం జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా సీనియర్ రాజకీయ నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కవ అవుతున్నాయి. టిక్కెట్లు నిరాకరించడానికి లేదా పదవుల నుంచి తప్పించడానికి ఈ లైంగిక వేధింపుల ఆరోపణల్ని హైలెట్ చేస్తున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయి. గత అనుభవాలు చూస్తే.. బీఆర్ఎస్ హైకమాండ్ రాజకీయాల్లో ఇది కూడా ఓ వ్యూహమేనని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.. నిఘా వర్గాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించుకుంటారు. అది సొంత ఎమ్మెల్యేలు అయినా సరే. ఆ సమాచారాన్ని ఎలా వాడుకోవాలో.. వారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఏదైనా రాజకీయమే.