పొట్ట ఎక్కువగా ఉంటే అందమే కాదు ఆరోగ్యం కూడా పాడవుతుంది. పెంచడం తేలికే కానీ కరిగించుకోవడం అంత ఈజీకాదు. పైగా
దీర్ఘకాలికంగా తీవ్రమైన వ్యాధుల రూపంలో మరింత నష్టాన్ని కలిగిస్తుంది. బరువు తగ్గడం, కొవ్వు కరిగించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కార మార్గం. బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా వ్యాయామం ఎంత ముఖ్యమో.. సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు బెల్లీ ఫ్యాట్ కరిగించుకునేందుకు అద్భుతమైన సూచనలు ఇచ్చారు.
వెచ్చని నీరు
రోజు ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. ఇది జీవక్రియని పెంచుతుంది. ఉబ్బరం రాకుండా సహాయపడుతుంది. రోజంతా గోరువెచ్చని నీటిని తాగితే ఇంకా మంచిది. ఇది శరీరంలోని ఇతర భాగాల కొవ్వుని కూడా కరిగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
పుదీనా టీ తాగండి
పుదీనా వాసన చాలా ఘాటుగా ఉంటుంది. బిర్యానీ వంటకాల్లో అదనపు రుచి ఇవ్వడం కోసం దీన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. ఇక బరువు తగ్గడం విషయానికి వస్తే ఈ పుదీనా టీని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీవక్రియని వేగవంతం చేస్తుంది. పుదీనా టీలో కేలరీలు తక్కువగా, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే తక్కువ సమయంలో పొట్టను కరిగించుకునేందుకు ఉపయోగపడే ఉత్తమ పానీయాలలో ఇది ఒకటి.
మెంతుల నీళ్ళు
వేయించిన మెంతులు మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని ఆహారంలో తినడం లేదా నీటిలో కలుపుకుని అయినా తాగొచ్చు. ఈ పానీయం ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. లేదంటే మెంతి గింజలు రాత్రంతా నానబెట్టి పొద్దున్నే తిన్నా కొవ్వుని కరిగించేస్తుంది.
కేలరీలను తగ్గించాలి
ఫ్లాట్ స్టమక్ పొందాలంటే ముందు కేలరీలను తగ్గించాలి. వైట్ బ్రెడ్, పాస్తా, వైట్ రైస్ వంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. వీటితో పాటు కుకీస్, కేక్స్, మిఠాయిలు వంటి షుగర్ ఫుడ్స్‌ని తగ్గించాలి. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండడంతో బరువు, బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.
ప్రోటీన్, ఫైబర్
బెల్లీని తగ్గించడంలో ప్రోటీన్, ఫైబర్ చాలా అవసరం. కండరాలను పెంచేలా చేస్తుంది ప్రోటీన్. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచి జీర్ణ వ్యవస్థను మెరుగ్గా చేస్తుంది. ఇందులో భాగంగా మీట్, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్ వంటి ఫుడ్స్‌ని తీసుకోవాలి.
హెల్దీ ఫ్యాట్స్
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు హెల్దీ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి. వీటిని తినడం వల్ల మీకు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అధికంగా తినాలన్న కోరికను కంట్రోల్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్, అవకాడోలు, ఆలీవ్ ఆయిల్ వంటివి తినొచ్చు. వీటితో పాటు నీళ్లు బాగా తాగాలి.
కంటినిండా నిద్ర, వ్యాయామం
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ముందుగా కంటినిండా నిద్ర, రెగ్యులర్‌గా వర్కౌట్ చేయాలి. ప్రతి రోజు కనీసం 7 గంటల నుంచి 8 గంటల నిద్ర అవసరం. పరుగు, ఈత, నడక వంటి వర్కౌట్స్ చేయండి. దీంతో ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగవుతుంది. దీంతో ఎక్కువగా తినాలనే కోరిక ఉండదు.
వ్యసనాలకు దూరంగా ఉండాలి
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఆల్కహాల్, దూమపానం వంటి చెడు అలవాట్లు విస్మరించాలి. జీవనశైలిలో పూర్తిగా మార్పులు చేసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది గుండె, పేగులు, కాలేయం వంటి ఇతర అవయవాల చుట్టూ కూడా పేరుకుపోతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…