నేతి కాఫీ తాగారా ఎప్పుడైనా – తాగితే ఏం ప్రయోజనం!

ఫిల్టర్ కాఫీ..ఇన్స్టంట్ కాఫీ..బ్లాక్‌ కాఫీ..చాక్లెట్‌ కాఫీ..కోల్డ్‌ కాఫీ.. అంటూ బోలెడు కాఫీలు తాగుంటారు. కానీ నేతి కాఫీ అని ఎప్పుడైనా విన్నారా?ఇప్పుడు ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు కాఫీ ప్రియులు. అయితే నేతి కాఫీ రుచికోసం మాత్రమే కాదు..ఈ కాఫీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి..

జీవక్రియను పెంచుతుంది
నెయ్యి కాఫీ..వినడానికి వింతగా అనిపిస్తున్నా ప్రస్తుతం ఈ కాఫీ బాగా ట్రెండ్ అవుతోంది. సెలబ్రెటీలంతా ఇప్పుడు నేతి కాఫీ జపమే చేస్తున్నారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు. నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. పొట్టలో యాసిడ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే నెయ్యిలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యి కాఫీ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది…తిన్న ఆహారాన్ని త్వరగా అరిగేలా చేస్తుంది. మొండి కొవ్వులను కరిగిస్తుంది. పైగా పేగులకు సంబంధించిన పుళ్లు, ఇబ్బందులను తగ్గిస్తుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది.

హార్మోన్ల అసమతౌల్యతను అదుపులో ఉంచుతుంది
అమ్మాయిలు, మహిళల్లో హార్మోనుల్లో అసమతౌల్యత పెద్ద సమస్య. నేతి కాఫీ ఆ సమస్యను అదుపులోకి తేవడంలో సాయపడుతుంది. కప్పు కాఫీలో టేబుల్‌ స్పూను నెయ్యి కలిపి పరగడుపునే తీసుకోమంటున్నారు. దీనివల్ల తర్వాత ఏం తీసుకున్నా శరీరంలో ఇన్సులిన్‌ శాతం పెరగకుండా చూసుకుంటుందట. మధు మేహం, మెటబాలిజం సమస్యలున్న వారు దీనిని ప్రయత్నించవచ్చు.

పరగడుపునే మంచిది
నిత్యం వ్యాయామం చేసేవారు దీనిని వ్యాయామానికి ముందు తీసుకుంటే శరీరానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ నచ్చిందని రోజంతా అదే పనిగా తాగకూడదు. కేవలం రెండు సార్లు మాత్రమే. సాయంత్రం 5 తర్వాత అస్సలు తాగొద్దు.

నేతి కాఫీ ఇలా తయారు చేసుకోండి
ముందుగా కాఫీ పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి..బాగా మరుగుతున్నప్పుడు అందులో నెయ్యి వేసి ఇంకొంత సేపు కాగనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పాలల్లో కలుపుకోవాలి. పంచదార వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అలాగే తాగేయవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.