కొందరికి ఏది తిన్నా వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. భోజనం చేసిన వెంటనే లేదా బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే నీళ్లు గటగటా తాగేస్తారు. అలాగే పళ్లు తిన్నాక నీళ్లు తాగే వారి సంఖ్య ఎక్కువే. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదా – కాదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?
ఎసిడిటీకి కారణం అవుతుంది
ఏ ఫ్రూట్స్ తిన్నా అందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్రూట్స్ తిన్నాక నీళ్లు తాగితే జీర్ణరసాలు మరింత పలుచగా మారిపోతాయి. దీనివల్ల జీర్ణ ఎంజైమ్లు సరిగా పనిచేయవు. దీంతో తిన్న ఫ్రూట్స్ జీర్ణం కాక గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎసిడిటీకి కారణం అవుతుంది. పొట్టలోని ఆమ్లాలు, ఫ్రక్టోజు, ఈస్ట్ కలిసిపోయి పలుచగా మారుతాయి. దీనివల్ల కడుపునొప్పి వస్తుంది. గ్యాస్ కూడా అధికంగా విడుదలవుతుంది. ఇది గుండెల్లో మంటగా మారిపోతుంది. కాబట్టి గుండె ఆరోగ్యం కోసం మీరు పండ్లు తిన్నాక నీళ్ళు తాగడం మానుకోవాలి.
ఓ గంట గ్యాప్ ఇస్తే బెటర్
పీహెచ్ స్థాయిలో సమతుల్యంగా ఉండడం చాలా అవసరం. జీర్ణవ్యవస్థలో పీహెచ్ స్థాయిలు మారకుండా చూసుకోవాలి. మీరు ఎప్పుడైతే పండ్లు తిన్నాక నీరు తాగుతారో పీహెచ్ స్థాయిల్లో మార్పు వస్తుంది. ఇది పొట్టలో ఆమ్లాలు అధికంగా విడుదల అయ్యేలా చేస్తుంది. కాబట్టి దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ, సీతాఫలం, పుచ్చకాయ, మ్యాంగో వంటి రకాల పండ్లు తిన్నప్పుడు మీరు నీళ్లు తాగకండి. ఒక గంట గ్యాప్ ఇచ్చాక నీళ్లు తాగండి. ఎందుకంటే ఆ పండ్లలో నీరే అధికంగా ఉంటుంది.
డయాబెటిస్ ఉంటే
మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరికి సాధారణంగానే సమస్యలు ఎక్కువగా వస్తాయి. జీర్ణ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఇలాంటివారు పండ్లు తిన్నాక నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ మరింత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఆహారం జీర్ణం కాక కొవ్వుగా మారిపోతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తుంది. దీనివల్ల మీకు డయాబెటిస్ సమస్య పెరిగిపోతుంది. ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.
అందుకే ఫ్రూట్స్ తిన్నాక నీళ్లు తాగకపోవడమే మంచిది. కనీసం అరగంట నుంచి గంట గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.