పొత్తుల తర్వాత భీమవరంలో సీన్ మారిందా ? పవన్ పోటీ చేస్తారా ?

జనసేన అదినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అందులో ఒకటి భీమవారం. భారీ మెజార్టీ వస్తుందనుకున్న స్థానంలో ఆయన పరాజయం పాలయ్యారు. అది ఎలా జరిగిందన్నది ఇప్పటికీ జనసైనికులకు అర్థం కావడం లేదు. అయితే ఈ సారి పవన్ భీమవరం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

పవన్ పోటీ చేసినా చేయకపోచినా బీమవరం జనసేనకే కేటాయింపు

పొత్తుల్లో భాగంగా భీమవరంపై అందరి దృష్టి పడింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం మూడోస్థానంలో నిలచినప్పటికీ మంచి ఓట్లునే సాధించింది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఓట్లును కలిపితే మెజారిటీ దాదాపు 45 వేల వరకు ఉంటుంది. పొత్తులో అక్కడ సునాయాస విజయం ఖాయమని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పొత్తులపై రెండు పార్టీల అధిష్ఠానాలు స్పష్టత ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ముందునుంచే కలయిక ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీ నాయకులు చర్చించుకునే బరిలో నిలిచారు.

గతంలో పట్టు కోల్పోయిన టీడీపీ

ఒకప్పుడు.. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న భీమవరం.. రకరకాల రాజకీయ కారణాలతో.. పట్టు కోల్పోయింది. 1952లో.. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు.. 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 6 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో వీచిన జగన్ వేవ్‌లో.. వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో.. భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం, వీరవాసరం మండలాలున్నాయి. వీటి పరిధిలో.. 2 లక్షల 46 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా క్షత్రియ, కాపు సామాజికవర్గాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. ఈ సెగ్మెంట్‌లో.. కాపు సామాజికవర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది.

టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్

భీమవరంలో తెలుగుదేశంకి గట్టి నాయకుడు లేరు. గ్రూప్ పాలిటిక్స్.. పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి. ఒకప్పుడు.. టీడీపీకి ఎదురులేని సీటుగా ఉన్న ఈ సెగ్మెంట్.. ఇప్పుడు సరైన నాయకత్వం లేక.. వెనుకబడిపోతోంది. ప్రస్తుతం.. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న, జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి కి వ్యతిరేకంగా.. పార్టీలో కొత్త వర్గం తయారైంది. సీతారామలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా.. టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో.. భీమవరంను జనసేనకు కేటాయించడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు.