కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మెరుగుపడ్డారా ? అక్కడి నుంచే పోటీ చేస్తూ రిస్క్ తీసుకున్నారా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంది. రేవంత్‎రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఇప్పుడు దీనిపైనే ఉంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టుగా..ఓడిన చోటే మళ్లీ తీరాలనే పట్టుదలతో రేవంత్‎రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొడంగల్ నుంచే మళ్లీ బరిలోకి దిగేందుకు రేవంత్‎రెడ్డి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించిన పట్నం నరేందర్‎రెడ్డిపై రేవంత్‎రెడ్డి గెలవాలన్న పట్టుదలోత ఉన్నారు.

కర్ణాటక సరిహద్దు నియోజకవర్గం కొడంగల్

కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటిదాకా 16సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొదట్లో ఇక్కడ కాంగ్రెస్‌ వా నడిచింది. టీడీపీ ఆవిర్భావంంతో రెండు పార్టీల మధ్య వార్‌ నడిచేది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ట్రయాంగిల్‌ పోరు మొదలైంది. ఇప్పటివరకు ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తొలిసారి 2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్‎రెడ్డిని గెలిపించారు. కొడంగల్ నియోజకవర్గంలో 2 లక్షల 16 వేల మందికిపైనే ఓటర్లున్నారు.

గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి షాక్

గత ఎన్నికల్లో ఓటమి పాలైన రేవంత్‌‎రెడ్డి, ఈసారి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అప్పుడు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే, ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా హోదాలో బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంతోపాటు కొడంగల్‎పైనా దృష్టి పెట్టారు రేవంత్‎రెడ్డి. వరుసగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్‌ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా కమిటీలు పటిష్టం చేసుకుంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు కొడంగల్‎ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తిరుగులేని నాయకుడిగా ఉన్న గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‎రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప కొందరు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్‎లో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‎రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన గుర్నాథ్‎రెడ్డి..తాజాగా కాంగ్రెస్‎లో చేరడం ఇక్కడి రాజకీయాల్లో పెద్ద మార్పేనని చెప్పుకోవచవ్చు.

రేవంత్‌కు అంత వీజీ కాదు !

రేవంత్ టార్గెట్ గా పట్నం నరేందర్ రెడ్డి సోదరుడు మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి పదవ ిఇచ్చారు. పట్నం నరేందర్‎రెడ్డి సామాజిక వర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించానని ఎమ్మెల్యే పట్నం నరేందర్‎రెడ్డి చెబుతున్నారు. కచ్చితంగా మరోసారి కొడంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఎమ్మెల్యే నరేందర్‎రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో పట్నం నరేందర్‎రెడ్డి 9 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్‎రెడ్డిపై గెలుపొందారు.