కేసీఆర్ చేతులెత్తేశారా ? కేబినెట్ నిర్ణయాలు దేనికి సంకేతం ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటమి భయంతో వణికిపోతున్నారు. అందుకే ఆయన అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు నమ్మశక్యం కాని విధంగా వ్యవహరిస్తున్నారు. దానికి తాజాగా ఉదాహరణ.. 400 కిలోమీటర్ల మెట్రో… ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. ఓటమి భయంతో ప్రజల్ని మోసం చేయడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఎక్కువ మమంది నమ్ముతున్నారు.

ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని గతంలో తేల్చినకేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హమీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఆర్టీసీ ఉద్యోగులు చూసీ చూసీ కేసీఆర్ రెండో సారి గెలిచిన తర్వాత 2019 అక్టోబర్‌లో సమ్మెకు దిగారు. కానీ కేసీఆర్ అప్పుడు ఎంత కఠినంగా వ్యవహరించారంటే ఆర్టీసీ ఉద్యోగులంతా సెల్ఫ్ డిస్మిస్ చేసేసుకున్నారని ప్రకటించేశారు. సమ్మె చేసిన ఉద్యోగులతో ఇక సంస్థకు సంబంధం లేదని ప్రకటించారు. కొత్త వారిని నియమించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రకమైన మనోవేదనతో ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు కూడా. చివరికి కేసీఆర్ క్షమించి వదిలేశారు. మరో సారి సమ్మె అనే ఆలోచన చేయలేదు. జీతాలు కూడా ఇచ్చినప్పుడే తీసుకుంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగులకే జీతాలివ్వలేని పరిస్థితి

ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకే సమయానికి జీతాలు రావడం లేదు. హైదరాబాద్ తప్ప.. మిగతా జిల్లాల్లో ఉద్యోగుల పరిస్థితి జీతాల కోసం ఎదురు చూడటమే. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం లో కలిసినా ఎదురుచూపులు తప్పవు. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆర్టీసీ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరకత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారిని కూల్ చేసేందుకు కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులవి యాభై వేల కుటుంబాలు ఉన్నాయి. ఎలా చూసినా… వారి ఓట్లు ప్రభావిత స్థాయిలోనే ఉంటాయి. అందుకే కేసీఆర్ గతంలో వ్యతిరేకించినా ఇప్పుడు ఎలాంటి డిమాండ్ చేయకపోయినా సొంతంగా నిర్ణయం తీసేసుకున్నారు.

మెట్రో కట్టేస్తారా ?

ఏకంగా నాలుగు వందల కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని మూడు నుంచి ఐదేళ్లలో 69వేల కోట్లు పెట్టి పూర్తి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇటీవల రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకూ మెట్రోకు చేసిన శంకుస్థాపనలో ఇంకా ముందడుగు పడలేదు. అది కూడా ఎన్నికల కోసమే చేశారన్న ప్రచారం ఉంది. నిజానికి ఆ మార్గం వయబులిటీ కాదని చెబుతున్నారు. నాలుగు వందల కిలోమీటర్ల మెట్రోను నిర్మించి నిర్వహించాలంటే… దానికితగ్గ ఆదాయం రావాలి. 69వేల కోట్ల పెట్టుబడి పెడితే….. ఆదాయం లేకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. కట్టడం సాధ్యం కాదు.

ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం

అయితే ఈ వరాల జల్లులో తడిచే తెలంంగాణ ప్రజలు ఎంత వరకు నమ్మకం పెట్టుకుంటారన్నది మాత్రం అంచనా వేయడం కష్టం. ఎందుకంటే.. శంషాబాద్ వరకూ రెండో దశ ఎంఎంటీఎస్‌కు రాష్ట్రం సహకరిస్తే పొడిగింపు ఇస్తామని చెబుతున్నా… ఇంత వరకూ ఆసక్తి చూపలేదు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లకు తప్ప.. గత ఎనిమిదేళ్లలో ప్రత్యేకమైన మౌలిక సదుపాయల అభివృద్ధికి ఖర్చు పెట్టిందేమీ లేదు. తొమ్మిదేళ్లలో ఫ్లైఓవర్లకు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు…కానీ మూడేళ్లలో మెట్రో కోసం 70వేల కోట్లు ఖర్చుపెట్టడం సాధ్యమేనా . ?. కేసీఆర్ గత ఎన్నికలకు ముందు చెప్పినవి చాలా వరకూ పరిష్కారం కాలేదు. రాజకీయాల్లో ప్రజలు నమ్మాలంటే.. వారిని నమ్మించాలి. చేస్తామా లేదా అన్న సంగతి తర్వాత. ముందు నమ్మించాలి. ఈ విషయంలో కేసీఆర్ సుప్రసిద్ధుడే. కానీ పదే పదే తన నమ్మకాన్ని ఓట్లకు అమ్ముకునే ప్రయత్నం చేస్తూండటమే రివర్స్ అవుతోంది