Hanuman Jayanti 14th May 2023: ఆంజనేయుడు దేవుడు మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాస నిపుణుడు!

ఆంజనేయుడిని తలుచుకోగానే దేవుడు, రామభక్తుడు, అంజనీసుతుడు, వాయుపత్రుడు, పురాణ పురుషుడు అంటూ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే ఆంజనేయుడంటే దేవుడు మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాస గని అని మీకు తెలుసా..

చైత్రమాసంలో హనుమాన్ విజయోత్సవం – వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి
ఆంజనేయుడి జన్మ తిథి చైత్రమాసంలోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో ఉంది. ఎందుకంటే చైత్ర మాసంలో హనుమాన్ జయంతి కొందరు జరుపుకుంటే వైశాఖ మాసంలో జరుపుకుంటారు ఇంకొన్ని ప్రాంతాల వారు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించాడని అందుకే ఈరోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. మరికొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్రమాస పౌర్ణమి నాడు ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించిన కారణంగా ఈ రోజు విజయోత్సవం జరుపుకుంటారంటారు. ఉత్తరాది సహా తెలంగాణలోనూ హన్ మాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు.

“కలౌ పరాశర స్మృతి:” అని శాస్త్రాలు చెప్తున్నాయి..
శ్లోకం
వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||
ఈ శ్లోకం ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు.

శ్రీమద్రామాయణ మహాకావ్యంలో ఐదవ కాండ అయిన సుందరకాండ ఆంజనేయుడి వీరత్వానికి, సాహస కృత్యాలకు, భక్తి వైభవానికి నెలవు. శ్రీరామచంద్రుడిని కలసిన క్షణం నుంచి సీతమ్మ జాడ తెలుసుకోవడం,అమ్మవారి ఆచూకీని తిరిగి స్వామివారికి చేరవేసేవరకూ ఎదురైన ఇబ్బందులను అధిగమించే సందర్భాల్లో హనుమంతుడి స్వామిభక్తి, అంకితభావం, ధర్మనిరతి వ్యక్తమవుతుంది. సుందరకాండ రామాయణానికే తలమానికం. రామభక్తుడైన ఆంజనేయుని విజయ పరాక్రమాలు ఆహ్లాదకరంగా వర్ణితం కావడంతో ఈ ‘కాండ’ సౌందర్యానికి మారుపేరుగా నిలిచిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

సీతాన్వేషణకు తమ్ముడితో బయలుదేరిన రాముడికి కిష్కింధలో మారువేషంలో అంజనీపుత్రుడు కనిపించగా, ‘సోదరా! ఇతడు నవవ్యాకరణాలనూ చదివిన జ్ఞానసంపన్నుడు,సాక్షాత్తూ సరస్వతీ స్వరూపుడు, సీతాన్వేషణ కార్యాన్ని నెరవేర్చగల సమర్థుడు’ అని హనుమలోని విశిష్ట లక్షణాలను వివరించాడు రామ చంద్రుడు. అయితే నవమ బ్రహ్మ పదవి కంటే ‘రామబంటు’గా ఉండేందుకే ఇష్టపడతానంటాడు హనుమంతుడు అందుకే…
‘యత్రయత్ర రఘునాథ కీర్తనమ్‌/తత్రతత్ర కృతమస్తకాంజలిమ్‌’
రామనామం వినిపించినచోటల్లా అంజలి ఘటించి నిలుచుండిపోతాడు హనుమంతుడు. ‘జై శ్రీరామ్‌’ అనే మాట వినిపిస్తే రాముడి కన్నా ముందే తన తేజస్సుని అక్కడి ప్రసరింపచేసి కార్యోన్ముఖుడైపోతాడట హనుమంతుడు. అందుకు శ్రీరామచంద్రుడు లాంటి ప్రభువు- ఆంజనేయుడు లాంటి బంటు లేడంటారు. ఆంజనేయుడు లాంటి బంటు లభించడం తన అదృష్టంగా రామచంద్రుడే కొని యాడాడని తులసీదాస్‌ కీర్తించారు.

ఆంజనేయుడి నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే
-‘దీక్ష, మనోనిగ్రహం, ధైర్యం, వినయం, త్యాగం, ఆత్మవిశ్వాసం, అంకితభావం, మనోబలం, బుద్ధి కుశలత, కార్యసాఫల్యానికి ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు సంపూర్ణంగా ఉన్న హనుమంతుడిని యువత ఆదర్శంగా తీసుకుని జీవితాలను తీర్చిదిద్దుకోవాలి’ అన్నారు స్వామి వివేకానంద.
-ఆత్మ విశ్వాసం విజయానికి తొలిమెట్టు అనే సూత్రాన్ని హనుమ అక్షరాల పాటించాడు. ఎందుకంటే సీతాన్వేషణకు లంకకు వెళుతున్న తాను ఎప్పటికి తిరిగా రాగలనో చెప్పలేను కానీ, సీతమ్మ జాడను తెలుసుకుని వస్తానని చెప్పి వెళ్లాడు
-సీతాన్వేషణకు సముద్రాన్ని దాటుతున్నప్పుడు సాగరగర్భం నుంచి పైకి వచ్చి మైనాకుడు ఇస్తానన్న ఆతిథ్యాన్ని మృదువుగా తిరస్కరించి ముందు స్వామికార్యం అని చెప్పి ముందుకు సాగడంలో పనిపట్ల అంకిత భావం కనపిస్తుంది
-సీతామాత ఆచూకీ దొరక్కపోతే ఆత్మహత్యే శరణ్యం అని భావించి అంతలో మనోబలంతో తనకు తానే ధైర్యం చెప్పుకుని పట్టుదలతో ప్రయత్నం సాగించాడు
-తాను సాధించిన కార్యాలు తన ఘనతగా కాకుండా వానర సమూహ విజయంగా అభివర్ణించిన మహోన్నతుడు, జ్ఞానుల్లో అగ్రగణ్యుడు, సకల గుణనిధుడు అయినప్పటికీ పెద్దల ముందు వినయశీలి హనుమంతుడు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.