అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్ గఢ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై కమలనాథులు ప్రత్యేక దృష్టి పెట్టారు మోదీ, అమిత్ షా, నడ్డా సహా పలువు నేతలు ఇప్పుడు ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తగిన వ్యూహాలు రూపొందిస్తున్నారు ఈ దిశగా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై పలు కీలుగా నిర్ణయాలు తీసుకుంది. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వీలుగా బ్లూ ప్రింట్ రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఏమిటి ఏ,బీ,సీ,డీ కేటగిరీ లు
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసింది. సుదీర్ష, సమగ్ర చర్చల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అదనపు శ్రద్ధ పెట్టేందుకే ఈ కేటగిరైజేషన్ అమలు జరుపుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 90 నియోజకవర్గాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు.
27 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు
పార్టీ ఛత్తీస్ గఢ్ ఎలక్షన్ ఇంఛార్జ్ ఓపీ మాధుర్, సహ ఇంఛార్జ్ మన్సూఖ్ మాండవీయ కలిసి రూపొందించిన బ్లూ ప్రింట్ ను ప్రధాని మోదీ ముందు ఆవిష్కరిస్తూ అనేక కీలకాంశాలు ప్రకటించారు. ఇప్పటికే 27 నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులను గుర్తించినట్లు వెల్లడించారు. కేటగిరీల వల్ల ఎన్నికల వ్యూహాల అమలు సులువు అవుతుందని లెక్కగడుతున్నారు. వరుస ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నియోజకవర్గాలు ఏ కేటగిరీలో ఉంటాయి. మిశ్రమ ఫలితాలు వచ్చినవి బీ కేటగిరీలో పెట్టారు. బీజేపీ కాస్త బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను సీ కేటగిరీ కింద వర్గీకరించారు. ఇంతవరకు బీజేపీకి అందని స్థానాలను డీ కేటగిరీగా చెబుతున్నారు.
బీ, సీ కేటగిరీలపై అధిష్టానం ఆదేశాలు
బీసీ కేటగిరీల్లోని 22 స్థానాలు, డీ కేటగిరిలోని ఐదు స్థానాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పక్షం రోజుల క్రితం అధిష్టానం ఆదేశించింది. ఆ సంగతి కూడా మోదీ సమక్షంలో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఆ దిశగా సక్సెస్ సాధిస్తే మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 50 శాతం సీట్లు కొత్తవారికి కేటాయించాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందు కోసం అభ్యర్థుల వేట మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు ఈ బాధ్యత అప్పగించారు.
మధ్యప్రదేశ్లో బలహీన స్థానాలపై ఫోకస్
మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. మరోసారి అధికారానికి వచ్చే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సంక్షేమ కార్యక్రమాల ప్రభావం, ఎన్నికల్లో లబ్ధికి అవకాశాలపై మధ్యప్రదేశ్ బీజేపీ ఇప్పటికే అధ్యయనం చేస్తోంది. దానితో పాటుగా బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కార్యకర్తలను ఉత్తేజ పరచాలని మోదీ స్వయంగా ఆదేశించినట్లు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. రాష్ట్ర నాయకులు ఐకమత్యంగా ఉంటే వరుస విజయాలు కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.