ఆరోగ్యకరమైన ఆహారాల లిస్ట్ చాలా ఉంటుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనవి నట్స్. అయితే వీటిని ఎప్పుడంటే అప్పుడు కాకుండా రోజూ పరగడుపునే గుప్పెడు తింటే చాలు..నాలుగు వారాల తర్వాత మీ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పు మీకే కనిపిస్తుందంటారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ పరగడుపునే గుప్పెడు నట్స్ తింటే ఏం జరుగుతుందంటే..
గుండెకు మంచిది
జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, బాదం, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఇంకా చాలా రకాలున్నాయి. ఈ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ నట్స్ లో సెలీనియం, విటమిన్ ఈ, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవన్నీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి. చర్మ కణాలను, శరీర కణాలను రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి.
బరువు తగ్గుతారు
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ గుప్పెడు నట్స్ తీసుకుంటే చాలు. పైగా బరువు తగ్గాలనే ఆలోచనతో ఆహారం మానేస్తుంటారు కాబట్టి వీటి నుంచి శరీరానికి అవసరం అయిన ప్రోటీన్లు అందుతాయి. పొద్దున్నే నట్స్ తీసుకుంటే పొట్టనిండినట్టు అనిపిస్తుంది. ఆకలిని నియంత్రించి పొట్టదగ్గర పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీర బరువు తగ్గుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి మంచిది
నట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవడంలో ముందుంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
మెదడు-ఎముకలకు ఆరోగ్యం
మెదడు ఆరోగ్యానికి కూడా వాల్ నట్స్, బాదం వంటివి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మెదడు అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అలాగే వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం