ఏపీలో వైసీపీ నుంచి మంత్రి విడదల రజనీ పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ ఫలితం పైన వైసీపీతో పాటుగా కూటమి నేతల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా రెండు శాతం పోలింగ్ పెరిగినా గుంటూరు పశ్చిమలో మాత్రం ఆ జోరు కనిపించలేదు. దీంతో ఫలితం ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. గతంలోలాగే ఉంటుందని… మంత్రి విడదల రజనీకి షాక్ తప్పదన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
చిలుకలూరిపేట నుంచి వచ్చిన రజనీ
వైసీపీ అభ్యర్దుల మార్పులుచేర్పుల్లో భాగంగా ఫస్ట్ లిస్టులోనే గుంటూరు వెస్ట్ అభ్యర్ధిగా రజనీ పేరు జగన్ ఖరారు చేసారు. పొరుగునే ఉన్న చిలకలూరిపేట నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు రజనీ అయితే ఈ సారి చిలకలూరుపేటలో ఆమె గెలిచే పరిస్థితులు లేవని సర్వేలు తేల్చడంతో జగన్ ఆమెను గూంటూరు వెస్ట్‌కి షిఫ్ట్ చేశారు.వైసీపీ గుంటూరు వెస్ట్‌లో ఇంత వరకు గెలవలేదు .. గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు.
గుంటూరులో టీడీపీకి గట్టి సపోర్ట్
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009లో కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ 3,300 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలిచి మరోసారి మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి .. అప్పట్లో జనసేన మద్దతుతో దాదాపు 18 వేల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో అక్కడ 66 పోలింగ్ శాతం నమోదైంది. ఇక గత ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గి 65.84కే పరిమితమైనప్పటికీ.. టీడీపీ నుంచి పోటీ చేసిన మద్దాలి గిరి 4,289 మెజార్టీతో విజయం సాధించారు. ఫ్యాన్ గాలి బలంగా వీచి, మరోవైపు జనసేన దాదాపు 28 వేల ఓట్లు చీల్చుకున్నప్పటికీ మద్దాలి గిరి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌లో 66.53 పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ జరిగినప్పటికీ వెస్ట్‌లో మాత్రం ఎప్పటిలా 66 మార్క్ దగ్గరే ఆగిపోవడం.. జనసేన మద్దతు ఉండటంతో టీడీపీ అభ్యర్థి విజయం సులువేనన్న విశ్లేషణ వస్తోంది.
టీడీపీకి కలసి వచ్చిన పరిస్థితులు
గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం మాధవికి కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు స్థానికంగా సొంత కేడర్ ఉంది. వారంతా తమకే పనిచేశారని చెప్తున్నాయి టీడీపీ శ్రేణులు.
పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకు అయినా కమ్మ సామాజిక వర్గం ఓటర్లు టీడీపీ వైపు నిలిచిందని బీసీ ఓటు బ్యాంకు రెండు పార్టీలకు చీలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాపు సామాజిక వర్గం ఓట్లపై జనసేన ప్రభావం కనిపించిందంటున్నారు. ఇక ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలి వెళ్లిన వారు పలువురు ఈ సారి ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారంతా టీడీపీ వైపు మొగ్గు చూపారన్న టాక్ వినిపిస్తుంది.