పడమటి రాష్ట్రం,ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రధానిగా ఢిల్లీలో సెటిలైనప్పుడు కూడా స్వరాష్ట్ర ప్రగతిపై ఆయన నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు గుజరాత్ ఆదర్శంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటారు.పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ కల్పనతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసించే అగ్రనాయకుడు ప్రధాని మోదీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
రెండేళ్లలో రూ.23 లక్షల కోట్లకు ఒప్పందాలు
గుజరాత్ లో పెట్టుబడుల వరద పారుతోంది. గత రెండేళ్లలో మొత్తం రూ.23.72 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.2022 ఫిబ్రవరి 1 నుంచి 2024 జనవరి 3 వరకు అందుబాటులో ఉన్న గణాంకాలు గుజరాత్ అభివృద్ధికి సూచికలుగా కనిపిస్తున్నాయి. కొవిడ్ కారణంగా వాయిదా పడిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అంటే పెట్టుబడుల సదస్సు ద్వారా కూడా కలిపి ఈ పెట్టుబడులు లెక్కబెడితే అది రూ.42.59 లక్షల కోట్లు అవుతుంది. కొవిడ్ నాటి పరిస్థితులు కూడా కలిపితే మొత్తం లక్ష ప్రాజెక్టులు గుజరాత్ కు వచ్చినట్లు లెక్కగట్టుకోవాలి. వీటి కారణంగా 34.62 లక్షల ఉద్యోగ ఉద్యోగావకాశాలు వస్తున్నాయి..
20 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు
ఈ నెల 10 నుంచి 12 వరకు మరో పెట్టుబడుల సదస్సు జరగబోతోంది. అప్పుడు కూడా దాదాపు 41 వేల కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. దీనితో మరో 24 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. 35 లక్షల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. మొత్తం 20 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రసాయనాలు, పెట్రో కెమికల్స్, ఇంజనీరింగ్, ఆటో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, పట్టణభివృద్ధి రంగాల్లో ఓప్పందాలకు ఏర్పాట్లు చేశారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల్లో సుమారు రూ.2లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. భారీ పరిశ్రమల రంగంలో రూ.2.74 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు..
చిన్న పరిశ్రమలకు సముచిత స్థానం
చిన్న,మధ్య తరహా పరిశ్రమల రంగానికి సముచిత అవకాశాలు ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. 32,884 ప్రాజెక్టులపై అవగాహన ఒప్పందం కుదిరేందుకు అవకాశం ఉంది. రూ.1.19 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. దీని వల్ల ప్రత్యక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా మరి కొన్ని లక్షల ఉద్యోగాలు రానున్నాయి. అహ్మదాబాద్, సూరత్, జామ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలకు అవకాశం ఉంటుంది. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు సుస్థిరమవుతాయి. గ్రామీణ పరిశ్రమలకు ఊతమిచ్చినట్లవుతుందని గుజరాత్ ప్రభుత్వం అంటోంది.