సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ అమాయక ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే తీస్తా సీతల్వాడ్ కు గుజరాత్ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో పాటు తీస్తా తీరుపై తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు రక్షణ కల్పించి ఉండకపోతే ఆమె తక్షణమే జైలుకు వెళ్లాల్సి వచ్చేది.
తీస్తా తప్పుడు సాక్ష్యాలు
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని , ఆ క్రమంలో అమాయకులను వివిధ కేసుల్లో ఇరికించారని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్ నిర్జర్ దేశాయ్ నేతృత్వంలోని ధర్మసనం తీస్తా తీరు పట్ల తీవ్ర అభ్యంతరం చెబుతూ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో పాలు పంచుకున్నారని నిగ్గు తేల్చింది. ఆమెతో పాటు ఆమె అనుచరులు సుప్రీం కోర్టులో సమర్పించినవి అన్ని తప్పుడు అఫిడవిట్లేనని గుజరాత్ హైకోర్టు తేల్చింది.అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ఆయన్ను జైలుకు పంపెందుకు కుట్ర పన్నారని గుజరాత్ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తీస్తా లాంటి వారికి బెయిల్ ఇవ్వడం సహేతుకం కాదని తేల్చేసింది.
అహ్మద్ పటేల్ సాయంతో మైనార్టీలను రెచ్చగొట్టి..
తీస్తా సీతల్వాడ్ చర్యల వెనుక దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఉన్నారని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఆయన సాయంతోనే కొందరి చేత తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేయించారని కోర్టు నిగ్గు తేల్చింది. మైనార్టీలను రెచ్చగొట్టి రాజకీయ పోలరైజేషన్ కు ప్రయత్నించారని కూడా న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
ఎన్జీవో పేరుతో పరపతి పెంచుకుని పద్మశ్రీ
జర్నలిస్టుగా ఉన్న తీస్తా సీతల్వాడ్ క్రమంగా ఒక ఎన్జీవోను స్థాపించి దాని ద్వారా రాజకీయ అండతో అంచెలంచెలుగా ఎదిగారని గుజరాత్ హైకోర్టు గుర్తించింది. సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ పేరుతో ఆమె నిర్వహించే సేవా సంస్థ వల్ల ప్రజలకు న్యాయమూ , శాంతి రెండూ లభించలేదని కోర్టు అభిప్రాయపడింది. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ రాజకీయ నేతలతో ఉన్న పరిచయాల కారణంగా ఆమెకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించిందని ఆమె మాత్రం దేశాన్ని అస్థిరపరిచే చర్యలకు దిగారని గుర్తు చేసింది. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే విదేశీ శక్తులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని కోర్టు తేల్చింది. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ దేశంలో అస్థిరత సృష్టించే వారికి అడ్డుకట్ట వేయాలంటే తీస్తాకు బెయిల్ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు ధర్మాసనం తన 127 పేజీల తీర్పులో రాసింది.
మధ్యంతర బెయిల్ కొనసాగింపు..
నిజానికి తీస్తా సీతాల్వాడ్ కు గతేడాది నుంచి మధ్యంతర బెయిల్ కొనసాగుతోంది. ఆ బెయల్ ను గుజరాత్ హైకోర్టు ఉపసంహరించగా… తక్షణమే ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తొలుత ఇద్దరు సభ్యుల ధర్మాసనం తర్వాత ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆమె కేసును పరిశీలించింది. మధ్యంతర బెయిల్ ను మరో ఎనిమిది రోజులు కొనసాగించారు.దానితో ప్రస్తుతానికి ఆమె జైలుకు వెళ్లే అవసరం లేకుండా పోయింది.