ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో టిక్కెట్ల కసరత్తులు జరుగుతున్నాయి. ఈ సారి టిక్కెట్లు మిస్సయ్యే వారిలో ఎక్కువ మంది మంత్రులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విశాఖలో మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ పరిస్థితి తేడాగా ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అనకాపల్లిలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ డౌట్ అన్న ప్రచారం జరుగుతోంది. అమర్నాథ్ కూడా.. ఎంపీ టిక్కెట్ అయినా ఇస్తారు లేకపోతే ఎమ్మెల్సీ అయినా ఇస్తారని అనుకుంటున్నారు.
అమర్నాథ్‌పై వ్యతిరేకత
గుడివాడ గుర్నాథరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీచేసి టీడీపీ తరఫున అవంతి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ వెళ్దామనుకున్న అమర్నాథ్ కోరిక నెరవేరలేదు. 2019లో ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అమర్నాథ్‌ను అనకాపల్లి అసెంబ్లీ నుంచి బరిలోకి దింపింది అధిష్టానం. టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణపైన 8,169 ఓట్లతో గెలుపొందారు. సామాజిక వర్గ సమీకరణలతో రెండో సారి విస్తరణలో అమర్‌కు మంత్రి పదవి కూడా దక్కింది. కానీ ఆయన పనితీరుతో మొదటికే మోసం వచ్చింది.
మళ్లీ ఎంపీ టిక్కెట్ అడుగుతున్న అమర్నాత్
అసెంబ్లీ టిక్కెట్ రాదని క్లారిటీ రావడంతో ఎంపీ టిక్కెట్ అడుగుతున్నారు అమర్నాథ్. అటు మంత్రి.. మంత్రిని నియోజకవర్గం మార్చడం, అది కూడా ఎంపీగా పోటీ చేయిస్తే జనాల్లోకి నెగిటివ్ పోతుందనే భావనలో వైఎస్ జగన్ ఉన్నారట. అనకాపల్లి ఎంపీగా ఉన్న సత్యవతికి 2024లో మళ్లీ పార్లమెంట్ నుంచి పోటీచేసే ఉద్దేశం లేదట. ఆమె కూడా ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. . ఒకవేళ ఇదేగానీ జరిగితే అనకాపల్లి అసెంబ్లీ నుంచి సత్యవతిని.. పార్లమెంట్ నుంచి అమర్‌ను బరిలోకి దింపాలనే యోచనలో అధిష్టానం ఉందని చెబుతున్నారు. ఒక వేళ రెండూ కుదరకపోతే… మళ్లీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ చేస్తామని జగన్ హామీ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈ సారి మొహమాటాలు లేవంటున్న జగన్
వైసీపీ అధినేత.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. అందు కోసం … సర్వేల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. టిక్కెట్లు ఇవ్వడంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకునే చాన్స్ లేదని ముందుగానే చెబుతున్నారు. అందుకే… జగన్ ఏది ఇస్తే అది అనే పద్దతికి సర్దుకుపోతున్నారు నేతలు.