ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఉద్దండులు అక్కడి నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ స్థానంపై ప్రత్యేక ఆసక్తి ఉంది. ప్రస్తుతం మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయితే ఆయనకూ మార్పు గండం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
కరిగిన టీడీపీ కంచుకోట అనకాపల్లి
గ్రేటర్ విశాఖలో అనకాపల్లి సీటు హాట్ ఫేవరేట్. అనకాపల్లి టౌన్‌తో పాటు కశింకోట, అనకాపల్లి రూరల్ గ్రామాలు.. ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ.. కాపు, గవర ప్రధాన సామాజికవర్గాలుగా ఉన్నాయి. ఇప్పటిదాకా.. అనకాపల్లి రాజకీయాల్లో ఈ సామాజికవర్గ నేతల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. 1952లో ఏర్పడిన అనకాపల్లి నియోజకవర్గం.. తెలుగదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత.. పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అలా.. 2004 దాకా అనకాపల్లిలో పసుపు జెండా మాత్రమే ఎగిరింది. 2004 ఎన్నికల్లో.. దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో.. కొత్త పార్టీ అభ్యర్థులకు పట్టం కడుతూ వస్తున్నారు ఇక్కడి ఓటర్లు.
ఫోకస్ తగ్గించిన అమర్నాథ్
మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు.. సుదీర్ఘకాలం రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు. దాడి తెలుగుదేశం నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. కొణతాల ఎటూ తేల్చుకోలేక.. తెలుగుదేశానికి మద్దతుగా నిలబడ్డారు. ఇక.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన పీలా గోవింద సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలుపులో.. కాపు ఓటర్లు కీలకంగా ఉన్నారనే టాక్ ఉంది. 2019 ఎన్నికల్లో మాత్రం అనకాపల్లిలో వైసీపీ వేవ్ కనిపించింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరు, ఎవరికి వారే అన్నట్లుగా ఉండటంతో.. అమర్నాథ్ అనకాపల్లిపై ఫోకస్ తగ్గించారనే ప్రచారం జరుగుతోంది.
టిక్కెట్ అడుగుతున్న దాడి ఫ్యామిలీ
అమర్నాథ్ గనక.. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే.. అనకాపల్లి టికెట్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కానీ.. ఎన్నికల నాటికి ఉండే రాజకీయ పరిస్థితులను బట్టి.. అధిష్టానం ఎవరికి చాన్స్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. దాడి ఫ్యామిలీ తమకు న్యాయం చేయాలని గట్టిగా కోరుతోంది.