గ్రేట్ ఇండియా.. వన్ ఇండియా.. ఆర్టికల్ 370 రద్దు..

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులంతా ఒక్కటే. అందరికీ ఏకరూప చట్టాలు, విధానాలు, అవకాశాలుండాలన్నది బీజేపీ సహా ఆ పార్టీ భావస్వారూప్య సంస్థల ఆలోచనా విధానం. దశాబ్దాలుగా బీజేపీ ఈ మాట చెబుతున్నా.. అధికారంలో లేకపోవడం, పాలనలో ఉన్నా సరైన మెజార్టీ లేకపోవడంతో ఏ పని చేయలేకపోయారు. ఆర్టికల్ 370 రద్దు అనేది బీజేపీ అజెండాలో చాలా కాలంగా కొనసాగుతూ వచ్చింది. కశ్మీర్ భారతదేశానిది, అదీ అందరిదీ అని చెప్పాలంటే ఆర్టికల్ 370 రద్దు చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ వాదిస్తూ వచ్చింది. దేశంలో బీజేపీ అధికారం సుస్థిరమైన తర్వాత ధైర్యంగానూ, దృఢనిశ్చయంతో ఆ పని చేయగలిగారు..

2019 మైలు రాయి…

2019 ఆగస్టు 5న పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్టికల్ 370ని రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. భారత రాజ్యాంగంలో జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అధికరణం అది. 1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్ము-కశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌లో విలీనం అయ్యేందుకు అంగీకరించారు. కొంతకాలానికే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.ఆర్టికల్ 370లోని నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్ము-కశ్మీర్ రాష్ట్రంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు. ఆర్టికల్ 370లో భాగమైన సెక్షన్ 35ఎ ప్రకారం జమ్ము-కశ్మీర్‌లో భారత్‌కు చెందిన ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారెవరూ భూములు, ఎలాంటి ప్రాపర్టీలూ కొనలేరు. వాళ్లు అక్కడి అతిథులే కానీ పౌరులు కాదు…

2014 మేనిఫెస్టోలో…

నిజానికి జమ్ము-కశ్మీర్ మిగతా రాష్ట్రాల్లా భారత్‌లో కలిసి లేదు. అది భారత్‌తో ఒప్పంద పత్రంపై సంతకం చేసేటప్పుడే, ఒక పరిధి వరకూ తన సౌర్వభౌమాధికారాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకుంది. దానితో ఆర్టికల్ 370ని అడ్డం పెట్టుకుని కొన్ని వర్గాలు అరాచకాలకు దిగాయి. కశ్మీరీ పండిట్లపై సామూహిక మారణహోమానికి దిగి, జమ్మూ కశ్మీర్ నుంచి వారిని వాళ్లను వెళ్లగొట్టారు. భారత్ నుంచి విడిపోయి పాకిస్థాన్లో కలవాలనుకున్న వాళ్లు హింసకు దిగడం, ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లాంటి దుశ్చర్యలు తప్పలేదు.. 2014 లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆర్టికల్ 370 రద్దు తమ అజెండాలో ఉందని బీజేపీ ప్రకటించింది.ప్రజలు సంపూర్ణ మెజార్టీ చేపట్టబోయే పనుల్లో అదీ ఒకటని తేల్చేసింది.

కశ్మీర్లో శాశ్వత శాంతికి అవకాశం

ఆర్టికల్ 370 రద్దు కారణంగా జమ్మూకశ్మీర్ ప్రజలకు, దేశానికి అనేక ప్రయోజనాలు ఒనగూరాయి. ఆర్టికల్ 370 మాత్రమే ఉగ్రవాదానికి మూలమన్న భారత ప్రభుత్వ వాదన నిజమని తేలిపోయింది. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కావాలంటే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం వాదించిన సంగతి గుర్తే ఉండి ఉంటుంది. ఆర్టికల్ రద్దు చేసిన తొలి ఏడాదిలోనే ఉగ్రవాద చర్యలు 59 శాతం మేర తగ్గాయి. తర్వాతి కాలంలో పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. సీమాంతర ఉగ్రవాదం అదుపుకు వచ్చింది. రాజకీయ నాయకులు ఉగ్రవాద దాడుల భయం లేకుండా యద్ధేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారు.

కశ్మీర్ నుంచి వలసపోయిన వాళ్లు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ ప్రాంతానికి రాగలుగుతున్నారు. కశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం వచ్చింది. వారి స్థిరనివాసానికి అవసరమైన ఏర్పాట్లను కేంద్రప్రభుత్వం చేపట్టింది. కశ్మీరీ మహిళలను పెళ్లి చేసుకున్న బయటి వారికి డొమిసైల్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు.

జమ్మూకశ్మీర్లో పెట్టుబడులను ఆహ్వానించే దిశగా భారీ స్థాయిలో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. జమ్మూకశ్మీర్ కోసం దాదాపు 30 వేల కోట్ల రూపాయలతో పారిశ్రామికాభివృద్ధి పథకాన్ని అమలు చేశారు. బిజినెస్ రివైవల్ ప్యాకేజీ కింద మరో రూ. 10 వేల కోట్లు అందించారు. మోదీ ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలన్నింటినీ రాష్ట్రంలో అమలు చేసే అవకాశం వచ్చింది. మరి ఇంతకంటే వాళ్లకేం కావాలి.