ప్రభుత్వం బెంగళూరులో.. రిమోట్ ఢిల్లీలో…

కాంగ్రెస్ దేశంలో అతి పురాతనమైన పార్టీ. కాంగ్రెస్ భావజాలం, ఆలోచనా విధానం కూడా చాలా పురాతనంగానే ఉంటుందని చెప్పాలి. అధిష్టానాన్ని అడక్కుండా గ్లాస్ మంచినీళ్లు కూడా తాగే సాహసం కాంగ్రెస్ నేతలు చేయరు. ప్రతీ పని సోనియా కుటుంబం వారి పరివారం చెప్పినట్లే జరగాలని ప్రతీ సారి నిరూపితమవుతుంది. ప్రజా తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాలైనా అధిష్టానం కనుసైగలతోనే నడవాల్సి ఉంటుంది. వారి మాట జవదాటితే మాత్రం పుట్టగతులుండవని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించి చాలా రోజులైంది.

సోనియా పంపిన మంత్రుల లిస్టు

కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధిష్టానం చేతిలో కీలుబొమ్మలని కర్ణాటకలో మరో సారి నిరూపితమైంది. సీఎం, డిప్యూటీ సీఎం కాకుండా మరో ఎనిమిది మందిని సోనియా స్వయంగా ఎంపిక చేశారని సమాచారం. అందులో రాహుల్, ప్రియాంక పాత్ర ఉందని చెబుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత మంత్రుల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆమోదించినట్లుగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక లేఖను విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపునో, రాజ్ భవన్ నుంచో విడుదల కావాల్సిన మంత్రుల జాబితాను ఏఐసీసీ విడుదల చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. బీజేపీ కర్ణాటక శాఖాధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్.. ట్వీట్టర్లో విడుదలైన వేణుగోపాల్ లేఖను ప్రస్తావిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు స్వేచ్ఛ లోపించిందని ఆరోపించారు.

శివకుమార్ నోరు మూయించిన అధిష్టానం

నిజానికి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి. పార్టీలో అన్నీ తానై నడిపించినది ఆయనే. ప్రచారంలో ఎక్కువ శ్రమ పడినదీ, ఆర్థిక వనరులు సమకూర్చినది కూడా ఆయనే. కాకపోతే సోనియా కుటుంబం సిద్దరామయ్య పక్షం వహించింది. దానితో సిద్దరామయ్యకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సోనియా వర్గం ప్రచారం చేసింది. శివకుమార్ ను ఢిల్లీలో కూర్చోబెట్టి డిప్యూటీ సీఎం పదవిని అప్పగించేందుకు ఒప్పించిందే తప్ప… నీకు వయసైపోయిందీ డీకేకు ఛాన్సివ్వాలని సిద్దరామయ్యకు చెప్పలేదు. ఎంత కష్టపడినా శివకుమార్ కు ఫలితం దక్కలేదు. ఆయన డిమాండ్ చేసే అవకాశం లేకుండా పాచికలు వేసింది. తిరుగుబాటు చేసే ఛాన్స్ లేకుండా కేసులు ఆయన్ను ఇబ్బంది పెట్టాయి.

ఇక ఢిల్లీ టూర్లే..

కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వారానికి రెండు సార్లు ఢిల్లీ టూర్లు వేస్తారని చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. అదేమంటే మా అధిష్టానం ఢిల్లీల్లో ఉన్నందున వెళ్తున్నాము..అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తారు. ఒక సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ విషయంలో మీడియాపై కస్సుబుస్సులాడారు. మా పార్టీ మా ఇష్టం అన్నట్లుగా ఆయన తిట్ల దండకం అందుకున్నారు. రేపో మోపో సిద్దరామయ్య కూడా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే ప్రక్రియను మొదలు పెడతారు. కేబినెట్ విస్తరణకు సోనియా ఆమోదం పేరుతో ఓ సారి వెళతారు. ప్రభుత్వ నిర్ణయానికి అధిష్టానం ఆమోదం అంటూ మరోసారి వెళతారు.ఇకపై చిన్న నిర్ణయమైనా ముందు అధిష్టానం ఆమోదం పొంది చేయాల్సిందే. అందులో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఎందుకంటే అదీ కాంగ్రెస్….