వివాదాస్పద వీడియో వ్యవహారం తర్వాత హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పెద్దగా బయటకు రావడం లేదు. కానీ ఆయన అంతర్గతంగా తన పని తాను చేసుకుంటున్నారు. పత్తి కొండ నియోజకవర్గంలో ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటన్నారు. వైసీపీ హైకమాండ్ నుంచి కూడా ఈ రకమైన సంకేతాలు రావడంతో ఇక ఏ వివాదాల జోలికి వెళ్లకుండ… నియోజకవర్గంలో తెర వెనుక పనులు చక్క బెట్టుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
పత్తికొండపై గోరంట్ల మాధవ్ దృష్టి
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐగా దూకుడు చూపించి 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై హిందూపురం ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఎంపీగా ఎన్నిక ఎంత సెన్సేషన్ అయ్యిందో ఆ తరువాత వివాదాలతో ఇంకా ఫేమస్ అయిపోయారు గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కర్నూలు జిల్లా వైపు గోరంట్ల చూపు పడింది.
కర్నూలు జిల్లా పత్తికొండపై ప్రత్యేక దృష్టిసారించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తరచూ ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఏవో పరిచయాలు, వివాహాది శుభకార్యాల కోసం కాదు. రాజకయం కోసమే.
ఎమ్మెల్యేగా గెలవాలని గోరంట్ల మాధవ్ ప్రయత్నాలు
రాజకీయంగా తనకి సురక్షితమైన స్థానం కోసం అన్వేషణలోనే గోరంట్ల మాధవ్ పత్తికొండ రాకపోకలు అని వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఇప్పటి నుంచి ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలని లైనులో పెట్టిన మాధవ్ అంతా అనుకున్నట్టు జరిగితే పత్తికొండ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నానని అధిష్టానం వద్ద ప్రపోజల్ పెట్టారని అంటున్నారు. పత్తికొండలో గోరంట్ల మాధవ్ కు పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. అలాగే సామాజికవర్గ బలం కూడా ఉంది. ఈ ప్రాంతంలో కురుబ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తాను కురబ కావడంతో తన కమ్యూనిటీ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడతాయని, వైసీపీ ఇమేజ్ ఎలాగూ ఉండనే ఉంటుందనే ధీమాతో మాధవ్ ఉన్నారని తెలుస్తోంది.
బీసీలకు అత్యధిక సీట్లిచ్చే వ్యూహం – జగన్ ఆలోచన కూడా అదేనా ?
వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యూహం పాటించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అత్యధిక మిందికి బీసీ సీట్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలో రెడ్డి సామాజికవర్గంలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని అనుకుంటన్నట్లగా తెల్స్తోంది. పత్తికొండలో వైసీపీ నేతలైన కెడీసీసీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మలతో కొంత గ్యాప్ ఉంది. ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. టీడీపీ తరపున కేఈ కుటుంబంలో ఒకరు నిలబడతారు కాబట్టి బీసీకి కౌంటర్ ఇచ్చినట్లు ఉంటుందని హైకమాండ్ కూడా ఆలోచిస్తోందంటున్నారు. అందుకే ఆయనే అ అభ్యర్థి కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది.