ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ కాల్ కలకలం రేపింది. మహారాష్ట్ర పుణెలో ఉన్న గూగుల్ సంస్థ కార్యాలయంలో బాంబు ఉందంటూ ఆదివారం సాయంత్రం ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు.
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ కాల్ కలకలం రేపింది. మహారాష్ట్ర పుణెలో ఉన్న గూగుల్ సంస్థ కార్యాలయంలో బాంబు ఉందంటూ ఆదివారం సాయంత్రం ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు గూగుల్ సంస్థ కార్యాలయం సహా ఆ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం, పోలీసులు అది ఫేక్‌కాల్‌గా గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్ నుంచి ఆ బెదిరింపు ఫోన్ వచ్చినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
కాగా, ఆదివారం సాయంత్రం 7.54 గంటలకు ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న గూగుల్ కార్యాలయానికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి పుణెలోని ముంధ్వా ప్రాంతంలోని గూగుల్ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన గూగుల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వారు పుణె పోలీసులకు సమాచారమిచ్చారు.
వెంటనే స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు అక్కడకు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. చివరకు అది ఫేక్ కాల్‌గా ధ్రువీకరించిన పోలీసులు.. కాల్ చేసిన వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి బెదిరింపునకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.