బెల్లం అంటే చాలామందికి ఇష్టం. బెల్లంతో చేసిన వంటకాలనే కాదు, బెల్లాన్ని కొరుక్కుని తినేందుకు చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకు చాక్లెట్లు తినడం చాలా అలవాటు. అయితే చాక్లెట్లకు బదులు బెల్లం ఇస్తే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది శుద్ధి చేసిన చక్కెర కన్నా చాలా రెట్లు మంచిది.
బెల్లం తింటే ఉపయోగాలివే!
బెల్లం తినడం వల్ల ఐరన్ లభిస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రోజూ పిల్లలకి ఒక చిన్న బెల్లం ముక్క తినిపించడం వల్ల మంచిదేనని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం పౌడర్ పాలల్లో కలిపి పిల్లలకి తాగించొచ్చు. పిల్లలకి జలుబు, దగ్గు సమయంలో అల్లం, తులసి ఆకులు, బెల్లం కలిపి ఇస్తే ఉపశమనం లభిస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో రోజు రోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతుంది. AQI స్థాయిలు దిగజారిపోతున్నాయి. దీని వల్ల శ్వాస రుగ్మతల కేసులు పెరిగిపోతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది. తరచుగా బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. పేద వాడి చాక్లెట్ గా పిలిచే బెల్లం నేచురల్ స్వీటనర్. బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయని శాస్త్రీయంగా నిరూపితమైందని చెబుతున్నారు. ఇంకా బ్రోన్కైటిస్, వీజింగ్, ఉబ్బసం, ఇతర శ్వాస రుగ్మతలకు ప్రభావవంతమైన నివారణగా పని చేస్తుంది. బెల్లం ఆరోగ్యకరమైన ఆహారం. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి కావాల్సిన ఐరన్ అందిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. టీ, కాఫీ లో పంచదారకి బదులుగా బెల్లం పొడి వేసుకుని తాగొచ్చు. వానాకాలం, శీతాకాలంలో బెల్లం తినడం వల శరీరం వేడిగా ఉంటుంది. ఇంకా రక్తహీనత సమస్య ఎదుర్కొనే వారికి ఇది మంచి సమస్య. మొటిమలు సమస్య వేధిస్తున్నా బెల్లం తింటే ప్రయోజనం ఉంటుంది.
అతిగా తింటే అనర్థం తప్పదు
బెల్లం ఆరోగ్యానికి మంచిదే కానీ ఏదైనా సరే అతిగా తింటే అనార్థమే. ముఖ్యండా డయబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా బెల్లానికి దూరంగా ఉండాలి. ఇది రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ను పెంచే ప్రమాదం ఉంది. శరీరంలో బ్లడ్ సుగర్ లెవల్ పెంచేస్తుంది. స్వీట్స్ లేదా చక్కరెకు ప్రత్యామ్నంగా బెల్లం వాడొచ్చని చాలామంది భావిస్తారు. బెల్లం వల్ల మధుమేహం రాదని కూడా అనుకుంటారు. ప్రతి 100 గ్రాముల బెల్లంలో 10-15 గ్రామాలు ఫ్రక్టోజ్ ఉంటుంది. దీన్ని రోజు తింటే బ్లడ్ సుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. చక్కెర తయారీలో పాటించే శుభ్రత బెల్లం తయారీలో ఉండదు. అపరిశుభ్ర పరిసరాల్లో బెల్లాన్ని తయారు చేస్తారు. అందువల్లా కంటికి కనిపించని సూక్ష్మజీవులు, పరాన్నజీవులు ఉంటాయి. బెల్లం ఎక్కువగా తిన్నట్లయితే అవి శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. అందుకే కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి కొనాలి. జీర్ణవ్యవస్థ బలోపేతానికి పనిచేసే బెల్లాన్ని ఎక్కువగా తింటే అదే జీర్ణవ్యవస్థకు చెడు చేస్తుంది. అందుకే ఆరోగ్యానికి ఎంతమంచిది అయినా కొంతవరకే అని గుర్తించాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం