పల్లెల కోసం బీజేపీ – వైసీపీ సర్కార్ నిధుల మళ్లింపుపై మహాధర్నాకు సిద్ధం !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సీమలను పెడుతున్న అగచాట్ల నుంచి కాపాడేందుకు బీజేపీ రంగంలోకి దిగుతోంది. గ్రామ పంచాయతీ నిధులను పూర్తి స్థాయిలో ఊడ్లేస్తున్న ప్రభుత్వ నిర్వాకంపై పోరుబాట పట్టింది. పదో తేదీన మహాధర్నా నిర్వహించాలని నిర్ణయంచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు.. పంచాయతీల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్లిచేసుకుంది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు క్షేత్ర స్థాయి పోరాటానికి సిద్ధమయ్యారు.

పంచాయతీలకు కేంద్రం నుంచి దండిగా నిధులు

గ్రామ పంచాయతీలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దండిగా నిధులు సమకూరుస్తుంది. పంచాయతీల్లో నిధులు ఉంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తద్వారా గ్రామసీమల్లో అభివృద్ధి జరుగుతుందని మోదీ ప్రభుత్వం గట్టి నమ్మకం. అందుకే ఫైనాన్స్ కమిషన్ ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు అందించే ఏర్పాట్లను చేసింది. అయితే ఏపీలో గత మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పేరుతో కేంద్రం ఇస్తున్న నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంటోంది. దీంతో సర్పంచులు అంతా అసహనంతో ఉన్నారు. తమను సర్పంచ్‌లుగా గెలిచిన ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఎప్పటికప్పుడు మళ్లించేసుకుంటున్న రాష్ట్రం

సాధారణంగా పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వాటిలో గ్రామాలు కూడా ఉంటాయి. గ్రామాల్లో పెద్ద ఎత్తున సహజవనరులు ఉంటాయి. క్వారీలు..ఇతర వనరుల నుంచి ప్రభుత్వానికి వేల కోట్లు వస్తాయి. గ్రామాల పరిధిలో ఉండే పరిశ్రమలు కట్టే పన్నుల నుంచి వాటా ఇవ్వాలి. ఇలా గ్రామాలకు వేల కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒక్క రూపాయి ఇవ్వదు. పైగాకేంద్రం నుంచి వస్తున్న నిధుల్ని లాగేసుకుంటున్నారు. ఇదే గ్రామ పంచాయతీలను ఆర్థిక సమస్యల్లోకి నెడుతోంది.

బీజేపీ మద్దతు కోరిన సర్పంచ్‌లు – పోరాటానికి బీజేపీ రెడీ !

కేంద్రం ఎంతో ముందుచూపుతో నిధులు ఇస్తున్నా రాష్ట్రం మళ్లించేసుకుంటోందని ఈ విషయంలో పోరాటం చేసేందుకు మద్దతు ఇవ్వాలని సర్పంచ్‌లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్వాకంపై పూర్తి వివరాలు సేకరించిన ఏపీ బీజేపీ ప్రభుత్వ నిర్వాకానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పదో తేదీన మహాధర్నా చేపడుతున్నారు.