కాంగ్రెస్ అంటే అంతర్గత కుమ్ములాట. కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ లేకపోవడం. కాంగ్రెస్ అంటే పెద్దా చిన్నా తేడా లేకుండా తిట్ల దండకం అందుకోవడం. కాంగ్రెస్ అంటే వెనుకాముందు చూడకుండా తోటివారిని అవమానపరచడం. కాంగ్రెస్ అంటే నేనొక్కడినే ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకోవడం. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సొంత పార్టీ వారిపైనే బురదజల్లుతున్నారు. విమర్శలు చేస్తున్నారు..
సీనియర్లపై కస్సుబుస్సులాడిన గెహ్లాట్
మరో నాలుగు నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. గెహ్లాట్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అలాగని అందరినీ కలుపుకుపోతారా అంటే కుదరదనే చెబుతున్నారు. నామాటే శాసనం.. ఇతరులు ఇష్టమైతే ఉండటం లేకపోతే వెళ్లిపోవడం అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు.ఇటీవల జరిగిన ఒక వ్యూహ భేటీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ పార్టీ పరిశీలకుడు మధుసూధన్ మిస్త్రీ సమక్షంలోనే పార్టీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఆహార, పౌర సరఫరాల మంత్రి ప్రతాప్ సింగ్ కచారియావాస్ పై సీఎం గెహ్లాట్ ఆరోపణలు సంధించారు. అసలు సంగతి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం చెందారు. కేసీ వేణుగోపాల్ ఆయన్ను భరిస్తున్నారని తనకు నిర్ణయాధికారం ఉంటే ఎప్పుడో చర్యలు తీసుకుని ఉండేవాడినని హెచ్చరించారు. అశోక్ గెహ్లాట్ కు పవర్స్ లేకుండా చేశారన్న అనుమానం సైతం ఈ సంఘటన వల్ల కలుగుతోంది. ఇక జైపూర్ మేయర్ మునీష్ గుర్జార్ పట్ల ప్రతాప్ సింగ్ ఆరోపణలు సంధించినందునే సీఎం ఎదురుదాడి చేశారని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఢిల్లీ వెళ్లి రాహుల్ కు చెప్పకోండి..
ఎవరైనా ఏదైనా అడిగితే ఢిల్లీ వెళ్లి చెప్పుకోండి అని గెహ్లాట్ సమాధానమిస్తున్నారు. మాజీ మంత్రి రఘుశర్మ కులగణన గురించి మాట్లాడితే గెహ్లాట్ ఆయనపై అంతెత్తున ఎగిరిపడ్డారు. కుల గణన పార్టీ నిర్ణయమని, అధిష్టానం ఆదేశాలు పాటించడం తన ధర్మమని గెహ్లాట్ చెప్పుకున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే రాహుల్ గాంధీతో మాట్లాడుకోవాలని హితబోధ చేశారు. పైగా ఎంత చేసినా ఏదో లోపం వెదకడం సీనియర్లకు అలవాటైపోయిందని, వాళ్లు అడిగినవన్నీ చేస్తున్నప్పటికీ ఏదోక సమస్య సృష్టించి తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని సొంత పార్టీ వారిపైనే ఎదురుదాడి చేస్తున్నారు.
మీకు అసలు దూరదృష్టే లేదా – సీఎం
కాంగ్రెస్ నాయకుల్లో దూరదృష్టి లోపించిందని, భవిష్యత్తు ప్రణాళికపై ఆలోచనే చేయడం లేదని గెహ్లాట్ అస్త్రాలు సంధించారు. ఓబీసీ రిజర్వేషన్ల హామీ కరెక్టు కాదని రఘువీర్ మీనా అనే నాయకుడు అభిప్రాయపడగా.. ఆయనపై గెహ్లాట్ ఎదురు విమర్శలు చేశారు. నీకు నువ్వు గొప్ప జ్ఞానివి అనుకుంటున్నావా అని నిలదీశారు. మీ మాటల్లో దూరదృష్టి లోపించిందని, పద్ధతి మార్చుకుంటే బావుంటుందని ఆయన సూచించారు. రాజ్యసభ ఎంపీ నీరజ్ డాంగీని కూడా గెహ్లాట్ వదిలిపెట్టలేదు. మూడు సార్లు ఓడిపోయినా అధిష్టానం పిలిచి రాజ్యసభ ఇచ్చిందని గుర్తుచేశారు. ఒక్కసారైనా గెలిచి పార్టీ విజయానికి సహకారం అందించాలని హితవు పలికారు. కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలని సలహా పడేశారు.