బొత్సపై పోటీకి గంటా నో – మరో సీనియర్ నేతను బలి చేయబోతున్నారా ?

విజయనగరం జిల్లాను రాజకీయంగా శాసించడంతోపాటు ఉత్తరాంధ్రలో రాజకీయంగా ప్రభావం చూపగల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రులు కిమిడి కళావెంకటరావు లేదా గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపేందుకు టిడిపి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో మంత్రి పోటీచేయనున్న నియోజకవర్గంలో ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలోని ఇతర నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం లేకుండా చేయవచ్చనేది టిడిపి వ్యూహంగా తెలుస్తోంది.

బొత్సకు బ్రేక్ వేయడానికి టీడీపీ కష్టాలు

చీపురుపల్లి నియోజకవర్గంలో ఈసారి రసవత్తర పోటీ నెలకుంటుందనే చర్చ నడుస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాటి కాంగ్రెస్‌ మొదలుకుని నేటి వైసిపి వరకు బొత్స చెప్పిందే శాసనంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అటు విశాఖసీటిలో కూడా ఆయనకు మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. మరోవైపు విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన సతీమణి, మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యంతోపాటు విశాఖ పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో కూడా ఆయన ఎన్నికల ప్రచారం చేసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వ ప్రభావం వల్ల జరగబోయే నష్టాన్ని నివారించాలంటే పోటీచేస్తున్న నియోజకవర్గంలో తగిన అభ్యర్థిని రంగంలోకి దింపడమే మార్గమని టిడిపి భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గ సమాచారం.

కళా వెంకట్రావుకు చాన్స్

సామాజిక నేపథ్యాన్ని కూడా భేరీజు వేయడంతో పార్టీ సీనియర్‌ నాయకుడు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, మరో మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్లు పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా వున్న కిమిడి నాగార్జునకు కళావెంకటరావు సొంత పెదనాన్న కావడం వల్ల పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చని ఇటు జనాల్లోనూ, అటు పార్టీలోనూ చర్చనడుస్తోంది. పార్టీకోసం నాగార్జున కాస్త ఒక్క అడుగు వెనక్కివేస్తే పార్టీ కేడర్‌ చెక్కు చెదిరే పరిస్థితులు కూడా ఉండబోవని కార్యకర్తల్లో ఇప్పటికే చర్చనడుస్తోంది.

కళా వెంకట్రావు కాకపోతే గంటా !

కళా వెంకటరావును రంగంలోకి దింపడం సాధ్యం కాకపోతే గంటా శ్రీనివాసరావును దింపుతారన్న చర్చనడుస్తోంది. గంటా ఇప్పటి వరకు ఓటమి తెలియని నాయకుడిగా గుర్తింపు పొందారు. తొలుత 1999లో అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన ఆయన ఆ తరువాత వరుసగా చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తర నియోకవర్గాల్లో విజయకేతనం ఎగరవేస్తూ వచ్చారు. ఇదే పరంపర గంటా చీపురుపల్లిలో కొనసాగిస్తే వైసిపిలో నాయకత్వ లోపాన్ని కూడా సృష్టించవచ్చన్న ఎత్తుగలో కూడా టిడిపి ఉన్నట్టుగా తెలుస్తోంది.