ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని, శివైక్యం చెందుతామని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఏడాది పొడవునా భక్తులతో కళకళలాడుతుంటుందా వారణాసి. ఇక ప్రత్యేక రోజులొచ్చాయంటే ఈ సందడి మరింత ఉంటుంది. గంగానదికి పుష్కరాలు ప్రారంభం కావడంతో శివపంచాక్షరి మంత్రం వారణాసిలో మారుమోగుతోంది. కాశీ క్షేత్రం ఎందుకంత ప్రత్యేకం
‘కాశ్యాన్తు మరణాన్ ముక్తిః…’
కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని అర్థం. అందుకే అక్కడ మరణించాలన్నది ఎందరో భక్తుల కోరి. అందుకే అప్పట్లో జీవిత చివరి మజిలీలో కాశీ క్షేత్రానికి వెళ్లిపోయేవారు. శివయ్య సన్నిధిలో కన్నుమూర్తే శివైక్యం చెందుతామని భావిస్తారు.
వారణాసి ప్రాశస్త్యం
ఒకప్పుడు విశ్వమొత్తం నీరే ఉండేది. మరో వస్తువుకి తావులేదు. అప్పుడు కొంత భాగాన్ని సృష్టించి…విష్ణువును ఇక్కడి నుంచి సృష్టిచేయి అని చెప్పాడు. విష్ణువు సృష్టి కార్యం కోసం తపస్సు చేస్తున్నాడు. విష్ణువు తపస్సు వల్ల పాదాల నుంచి గంగాదేవి పుట్టింది. సృష్టించిన కొద్ది భాగాన్ని కప్పేస్తోంది. అప్పుడు ఈశ్వరుడు చూసి త్రిశూలంతో ఆ భాగాన్ని పైకెత్తాడు. ఆ త్రిశూలం నాటిన భాగం కాబట్టి కాశీగా పిలుస్తారు. కాశిక అంటే త్రిశూలం… కాశిక తీసినది కాబట్టి కాశిగా పిలుస్తారు. అంటే సృష్టిలో మొదట పుట్టిన భాగమే కాశీ. ఆ తర్వాత విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మ ద్వారా ఈ సృష్టి అంతా మొదలైంది. శివుడు త్రిసూలాగ్రం మీద సృష్టించిన భూ ఖండమే కాశీ. దీనిమీద కూర్చుని బ్రహ్మదేవుడు సమస్త లోకాలనూ అందులో భాగంగా భూమినీ సృష్టించాడని పురాణగాథ. దేవతలు, రుషుల విన్నపం మేరకు శివుడు త్రిశూలంమీదున్న భూఖండాన్ని అలాగే దించి నేలమీద నిలబెట్టాడనీ అదే కాశీ పట్టణమనీ శివపురాణంలో ఉంది. మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరంగా కాశీని పేర్కొంటారు..అందుకే ఒక్కసారి ఈ క్షేత్రంలో అడుగుపెట్టినవారికి తిరిగి రావాలని అనిపించదంటారు.
పురాతననగరం వారణాసి
ఐదువేల సంవత్సరాలక్రితమే కాశీ నగరం ఉందనీ పండితులు చెబితే..ఈ నగరం మూడు వేల సంవత్సరాలనాటిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పూర్వం ఇక్కడ 72 వేల గుడులు ఉండేవనీ యోగశాస్త్రం ప్రకారం ఇది మనిషి శరీరంలోని నాడుల సంఖ్యతో సమానమనీ అంటారు.
సప్తమోక్షదాయక క్షేత్రాల్లో ఒకటైన కాశీలో మరణించినవాళ్లని అక్కడున్న దుండి గణపతి, కాలభైరవులు యముడికన్నా 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారని భక్తుల విశ్వాసం. అందుకే కాలభైరవ దర్శనానంతరం పూజారులు వీపుమీద కర్రతో కొట్టి కాశీ దాటి వెళ్లినా పాపాలు అంటకుండా నల్లని కాశీదారం కడతారు.
కేంద్రప్రభుత్వం ప్రారంభించిన కాశీ విశ్వనాథ ధామ్ ప్రాజెక్టు
వారణాసి ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తులూ ప్రజలూ కలిసి నిర్మించిన గుడులు కాశీలో 26 వేలకు పైనే ఉండేవట. ప్రస్తుతం వీటిసంఖ్య రెండున్నర వేలు దాటదు. ముస్లింల దండయాత్రల్లో మూడుసార్లు ధ్వంసమైనట్లూ, అక్బరు కాలంలో కొన్ని ఆలయాల్ని పునరుద్ధరించినట్లూ తెలుస్తోంది. కాశీలో ఎన్ని ఆలయాలున్నా అన్నిటికన్నా ప్రత్యేకం విశ్వనాథ మందిరం. అప్పట్లో ఎంతో వైభవంగా వెలిగిన ఈ ఆలయం..ఆ తర్వాత చుట్టూ భవనాలు నిర్మించడంతో ఇరుకుగా అయిపోయింది. మళ్లీ దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం కాశీ విశ్వనాథ ధామ్ ప్రాజెక్టును చేపట్టింది.