ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా బలపర్చాలన్న లక్ష్యంతో హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్దం చేశారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన ఏపీలో పార్టీని ఎలా ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలన్న అంశంపై సుదీర్ఘ కసరత్తు చేసి ఓ బ్లూప్రింట్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ బ్లూ ప్రింట్ ను అమలు చేసేందుకు హైకమాండ్ కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో ప్రత్యేక కార్యక్రమాలు
ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ మిగిలి పార్టీలతో పోటీగా రేసులో ఉండేలా కసరత్తు చేస్తున్నారు ప్రత్యర్థులు ఎలాంటి ఎత్తుగడలు వేసినా డోంట్ కేర్ అనేలా ఉండాలని స్కెచ్ వేస్తోంది. ముందుగానే క్లారిటితో పోటీలో భాగం కావాలనే ఆలోచనతో పార్టీని నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లాల వారీగా సభలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ చేసిన సహకరాన్ని గురించి వివరించే పనిలో నేతలు ఉన్నారు. కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పరివార్‌తోపాటుగా రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలు జిల్లాల వారీగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని వివరించటంతోపాటుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల ముందు పెడుతున్నారు.
కిరణ్ గేమ్ ఛేంజర్ !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో ఆయన్ను కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని యాక్టివ్ చేయాలనే ఆలోచనలో కూడ కేంద్ర నాయకత్వం ఉందని అంటున్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రోడ్ షోలను నిర్వహించేందుకు అవసరమైన ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారట. అయితే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేలా రూట్ మ్యాప్‌ను తయారు చేయాలని భావిస్తున్నారు. తెరవెనుక వ్యూహాల్లోనూ కిరణ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా చెబుతున్నారు.
నేతలంతా జనాల్లోనే ఉండటం ప్లస్ పాయింట్
కొన్నాళ్లుగా ఏపీ బీజేపీ నేతలంతా ఏదో ఓ ప్రోగ్రాంతోనే జనంలోనే ఉంటున్నారు. ప్రత్యేకంగా ఒక్క నేత మీద ఆధారపడకుండా ఎవరికి వారు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది ఎంతగానే ఉపయోగపడుతోంది. నేరుగా బీజేపీకి హైప్ వచ్చినట్లుగా కనిపించదు కానీ… చాప కింద నీరులా విస్తరించడానికి ఈ వ్యూహం బాగా ఉపయోగపడుతుదని అంచనా వేస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఏపీ బీజేపీ నుంచి అనూహ్యమైన రాజకీయ పోరాటాలు… ఉంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి.