విదేశీ ప్రతినిధులు వస్తున్నారంటే వారికి చిరకాలం గుర్తుండిపోయే మర్యాదలు చేయాల్సిందే. భారత పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగిపోయేలా ఆతిథ్యం ఇవ్వాల్సిందే. ఈ నెల 9,10 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు సంబంధించి కూడా కేంద్రప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా అల్పాహారాలు, భోజనాలు, విందులకు ప్రత్యేక సామాగ్రి తయారు చేయిస్తోంది. రాజధాని కొత్త ఢిల్లీలోని స్టార్ హోటళ్లలో ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి…
భారత సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పాత్రలు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు.. అని పాడుకుంటూ అతిధులు సంతోషంగా భోజనం చేయాలన్నది భారతీయ సంప్రదాయంలో చెప్పే మాట. పెళ్లిళ్లు లేకపోయినా ఇంటికి వచ్చిన అతిథులకు పెళ్లి భోజనం స్థాయిలో వడ్డించాలన్నది మొదటి నుంచి ఉన్న అలవాటే. దాన్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వమూ, జీ-20 ఫుడ్ కమిటీ ప్రయత్నిస్తున్నాయి. భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే భోజనం ప్లేట్లు తయారు చేయిస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేసే లక్ష్ పబువాల్ ఓ మెటల్ వేర్ కంపెనీకి భోజనం ప్లేట్లు తయారు చేసే కాంట్రాక్ట్ ఇచ్చారు. విదేశీ అతిథుల కోసం తయారయ్యే ప్లేట్లు వెండితో బంగారం తాపడం పెట్టి తయారు చేయాలని ఆదేశాలు అందాయి. ఆ ప్లేట్లను అతిథులు బసచేసే స్టార్ హోటళ్లకు సరఫరా చేస్తారు. ప్లేట్ చూడగానే తినాలనిపించేంతగా అందంగా ఉండాలని జైపూర్ కంపెనీకి ఆర్డర్ వెళ్లిందట…
200 మంది కళాకారులు
పాత్రల్లో చాలా వరకు ఇత్తడి బేస్ తో తయారు చేసి వెండి కోటింగ్ ఇచ్చారు. అతిథులను ఆహ్వానించే క్రమంలో ఇచ్చే పానీయాలను పోసే గ్లాసులను వెండితో తయారు చేసి.. వాటిపై గోల్డ్ కోటింగ్ ఇచ్చినట్లు జైపూర్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు కలిపి మొత్తం 15 వేల వరకు తయారుచేయగా వాటిని ఢిల్లీలోని అతిథులు ఉండే వేర్వేరు స్టార్ హోటళ్లకు చేర్చారు, పాత్రలు, గ్లాసులు తయారు చేయడానికి మొత్తం 200 మంది కళాకారులను నియమించారు. వాటిని తయారు చేసేందుకు దాదాపుగా యాభై వేల గంటలు పట్టిందట. అంటే ఒక్కొక్కరు దాదాపు రెండు నెలల పాటు ఈ పనిలోనే ఉన్నారని చెప్పాలి. జైపూర్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చిన పనివారు ఈ ప్లేట్లు, గ్లాసుల తయారీలో నిమగ్నమయ్యారు…
డిన్నర్ టేబుల్ పైకి అందమైన పాత్రలు
అతిథులు చూడగానే వారిని ఆకట్టుకునే విధంగా డిన్నర్ టేబుల్ పై అందమైన పాత్రలు ఉంచేందుకు కూడా ఈ సంస్థే ఏర్పాట్లు చేసింది. పూలు, నెమళ్లు, జాతీయ చిహ్నాలు ఆ పాత్రలపై కనిపిస్తుంటాయి. దేశాధినేతలు వాటిని చూస్తూ ఉండిపోవాల్సిందే. పూర్వకాలంలో మహారాజుల ఆహారశాలలో వాడిన డిజైన్లతో కొన్ని పాత్రలు తయారు చేశారు. వెండి వాడకం వల్ల పరిశుభ్రతకు అవకాశం ఉండటంతో పాటు, పాత్రలు ఆకర్షణీయంగా ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. గతంలో ఈ పాత్రలను దిగుమతి చేసుకుంటుండగా, ఇప్పుడు మేకిన్ ఇండియా అంటూ దేశంలోనే తయారు చేస్తున్నారు.