ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత దేశం వైపు చూస్తోంది. ఈ నెలలో జరగబోయే జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వెలువడే కీలక ప్రకటనల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది.ప్రపంచానికే భారత నాయకత్వం వహించే రోజు వచ్చిందని, అది ప్రధాని మోదీ చొరవకు నిదర్శనమని దేశాధినేతలు ప్రశంసిస్తున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల చెంతన భారత్ నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.
రెండు రోజుల ముందే వస్తున్న బైడెన్
జీ-20లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ సదస్సుకు ముందే ఇండియా వచ్చేస్తున్నారు. ఈ నెల 10 సదస్సు ప్రారంభమవుతుండగా, 7న తన బృందంతో ఇండియా వచ్చే బైడెన్.. 8న మన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత – అమెరికా వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరాటం, వీసాలు ప్రధానంగా చర్చకు వస్తాయని చెబుతున్నారు. రష్యా- ఉక్రేయిన్ యుద్ధంపై కూడా ప్రస్తావనకు రావచ్చు. యుద్ధాన్ని త్వరగా ముగించే విధంగా ఇరు దేశాలపై వత్తిడి తేవాలని భావిస్తున్నారు. భారత అధ్యక్షతన నిర్వహిస్తున్న జీ-20 సదస్సులో ఫలవంతమైన చర్చలు జరగాలని అమెరికా ఆకాంక్షిస్తోంది. అదే విధంగా 2026లో జీ-20 సదస్సు అమెరికాలో నిర్వహిస్తున్నందున అప్పుటి ఏర్పాట్లకు కూడా ఇండియాలో అనుభవం ఉపయోగపడుతుందని బైడెన్ ఆశిస్తున్నారు.
బెదిరిస్తున్న రష్యా…
ఉక్రేయిన్ యుద్ధం విషయంలో జీ-20 దేశాలను రష్యా బెదిరిస్తోంది. ఉక్రేయిన్ విషయంలో తమ వైఖరిని తప్పపట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని రష్యా హెచ్చరిస్తోంది. రష్యా కూడా జీ-20 సభ్యదేశమే. తమకు వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానం చేసినా తుది డిక్లరేషన్ కు అడ్డుతగలడం ఖాయమని జీ-20 సభ్యదేశాలను రష్యా హెచ్చరిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై యుద్ధ నేరాల అరెస్టు వారెంట్ ఉన్నందున ఆయన దేశం వదలి రావడం లేదని తెలుస్తోంది. రష్యా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి సర్గీ లావ్రోవ్ సదస్సుకు హాజరవుతున్నారు. పడమటి దేశాలు రష్యాను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ అనుమానిస్తున్న తరుణంలో జీ-20ను ఆ దేశం ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.
ఆర్థికాంశాలే ప్రధాన అజెండాగా…
సభ్యదేశాలతో పాటు భావసారూప్య ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు జీ-20 పనిచేస్తుంది. ఢిల్లీ సదస్సులో కూడా అదే అంశం ప్రస్తావనకు వస్తుందనడంలో సందేహం లేదు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి..దాని ప్రభావం ప్రపంచం మొత్తానికి విస్తరించకుండా ఆపగలిగింది. సభ్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఎదురవుతున్న ప్రతిబంధకాలను తొలగించుకునేందుకు సదస్సుల్లో చర్చలు ఉపకరిస్తున్నాయి. ట్రంప్ పాలనాకాలంలో అమెరికా, జీ-20 మధ్య వాణిజ్యం, వాతావరణం, వలస విధానంలో విభేదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించేందుకు తాము సిధ్దంగా ఉన్నామని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు. చూడాలి ఎంతమేరకు సక్సెస్ అవుతారో….