జీ-20 – భద్రతకు ప్రాధాన్యం – నేతల నోరు అదుపులో ఉండాలన్న పీఎం…

జీ-20 సదస్సు ఢిల్లీలో ఈ నెల 9,10 తేదీల్లో జరుగుతున్న వేళ కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశాధినేతలు, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి లోటు రాకుండా చేసుకునేందుకు బాధ్యతలను వేర్వేరు శాఖలకు అప్పగించింది. మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.

ఆర్మీ ఆధీనంలోకి ఢిల్లీ

జీ-20 సదస్సు నిర్వహణలో దేశ భద్రత కూడా దాగొందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పొరబాటు జరిగిన భారత పరువు మంటలో కలిసిపోయే అవకాశం ఉంది. దానితో భద్రతా చర్యల్లో భారత సైన్యానికి ప్రత్యేక భూమికను అప్పగించారు. ఎలాంటి కుట్ర జరిగినా దాన్ని భగ్నం చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఢిల్లీ మహానగరంలో వేర్వేరు చోట్ల ఆర్మీని మోహరించారు. ఆర్మీ ఇంటెలిజెన్స్ కూడా సమాంతరంగా పనిచేస్తోంది. అనుమానిత వస్తువులను తక్షణమే తొలగించేందుకు వీలుగా ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహణ పూర్తయ్యింది. ఉగ్రవాదుల మెరుపు దాడులను సమర్థంగా తిప్పుకొడుతూ జీ-20 ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే చర్యలపై కూడా మాక్ డ్రిల్ నిర్వహించారని వార్తలు వస్తున్నాయి. దీన్ని యాంటీ సాబొటేజ్ చెక్ మాక్ డ్రిల్ అని పిలుస్తున్నారు.

యూపీ, ఢిల్లీ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు

ఢిల్లీలో భద్రత, పారిశుద్ధ్యంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. ఎక్కడా చెత్తచెదారం కనిపించకుండా చూసుకుంటున్నారు. సభ నిర్వహించే భారత్ మండపానికి వెళ్లే దారిలో ఆక్రణమలను యుద్ఖ ప్రాతిపదికన తొలగించారు. అధికారులు తమను ఎప్పుడైనా సంప్రదించి తగిన సలహాలు పొందొచ్చని ఎల్జీ సక్సెనా ఆదేశించారు. భద్రతకు ఢిల్లీ పోలీసులు చాలనందున ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెయ్యి మందిని పంపించింది. ఎత్తైన భవనాలపై వాళ్లు పహరా కాస్తూ విదేశీ ప్రతినిధుల భద్రతలో నిమగ్నమవుతారు. ఢిల్లీతో పాటు పరిసర గ్రామాల ప్రజలెవ్వరూ తమ ఇళ్ల పైకప్పులపై తిరగకూడదని అలాంటి చర్యలు భద్రతకు ఇబ్బందికరంగా మారతాయని ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు అడ్వయిజరీ జారీ చేశాయి. డ్రోన్లు ఎగురవేయడం లాంటి చర్యలకు కూడా దిగకూడదు. ఈ ఉత్తర్వులు ఈ నెల 11 వరకు అమలులో ఉంటాయి…

మంత్రులైనా బస్సులోనే…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , జకార్తా పర్యటనకు వెళ్లేముందు కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి జీ-20 ఏర్పాట్లను సమీక్షించారు. మంత్రులంతా తమ వాహనాల్లో పార్లమెంటు హౌస్ కు వచ్చి అక్కడ నుంచి సదస్సు జరిగే భారత్ మండపానికి నిర్దేశిత బస్సుల్లో ప్రయాణించాలని ఆయన సూచించింది. ఎంతటి వారికైనా ఇదే నియమం వర్తిస్తుందన్నారు. జీ-20 సదస్సుపై అందరూ ప్రకటనలు చేయకూడదని ఆయన గుర్తుచేసింది. ప్రభుత్వం నియమించిన అధికార ప్రతినిధులు, విదేశాంగ మంత్రి, విదేశాంగ శాఖ అధికారులు మాత్రమే ఎప్పటికప్పుడు ప్రెస్ ముందు మాట్లాడతారని ఇతరులెవ్వరూ స్టేట్ మెంట్స్ ఇవ్వకూడదని మోదీ ఆదేశించారు.