జీ-20 – మోదీ తెచ్చిన ఏకాభిప్రాయం

భారత ప్రతిష్టను మరింతగా పెంచిన సదస్సు జీ-20 అని చెప్పక తప్పదు. సదస్సును నిర్వహించాలన్న సంకల్పం వచ్చినప్పటి నుంచే సభ్యదేశాల మధ్య సమన్వయానికి, సుహృద్భావ వాతావరణానికి ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. జీ-20 సభ్యులను ఒక తాటిమీదకు తెచ్చి ఆయాదేశాల సంక్షేమానికి, ప్రపంచ శాంతికి మోదీ బృందం కృషి చేసింది. యుద్ధాలు, సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక అసమానతలతో దూరం జరుగుతున్న దేశాలను మళ్లీ గాడిలో పెడుతూ అనేక వివాదాస్పద అంశాల్లో వారిని ఒప్పించగలిగారు..

చరిత్రలో నిలిచిపోయే న్యూఢిల్లీ డిక్లరేషన్

2030 నాటికి శక్తిమంతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు వీలుగా సమ్మిళిత అభివృద్ధి కోసం పని చేయాలని జీ-20 దేశాలు తీర్మానించాయి. ఇందుకు సంబంధించి వంద అంశాలతో కూడిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆమోదించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన బృందం కీలక భూమిక పోషించారు.ఉక్రెయిన్‌ సంక్షోభంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న తరుణంలో, న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం పొందటం భారత్‌ జీ 20 సారథ్యానికి దక్కిన విజయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఏకాభిప్రాయం సాధించడం మోదీ చొరవ, గొప్పదనంగా భావించాల్సి ఉంటుంది. ఒక్కో తీర్మానం ఆమోదించేందుకు సుదీర్ఘ చర్చలు, ఉత్కంఠభరిత క్షణాలను అనుభవించాల్సి వచ్చిందని భారత ప్రతినిధి అమితాబ్ కాంత్ ప్రకటించారు. రష్యాకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉక్రెయిన్ యుద్ధంపై చేసిన తీర్మానం న్యూఢిల్లీ డిక్లరేషన్ కే హైలైట్ గా చెప్పక తప్పదు. యుద్ధకాలంలోనూ ధాన్యం, సరుకుల రవాణాకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని తీర్మానం చేశారు.

అపనమ్మకాన్ని పోగొట్టి విశ్వాసాన్ని పెంచాలన్న మోదీ…

ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న అనుమానాలు, అయోమయాలను ప్రధాని మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. కొవిడ్ సృష్టించిన సమస్యలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ఈ అనుమానాలను మరింతగా పెంచిందన్నారు. ప్రాణనష్టం, ద్రవ్యోల్బణం, అణు యుద్ధ భయం ఇప్పుడు ప్రపంచ దేశాలను వెంటాడి వేటాడుతున్నాయని ప్రస్తావించిన మోదీ, ఇకపై పటిష్ఠమైన భాగస్వామ్యాలు, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను సమిష్టిగా పరిష్కరించుకునేందుకు చేయి చేయి కలుపుదామన్నారు.

సబ్కా సాథ్ సబ్కా వికాస్

55 దేశాల కూటమి ఆఫ్రికన్ యూనియన్ ను జీ-20లో భాగస్వామిగా చేసే తీర్మానాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిపాదించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ స్ఫూర్తిగా ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వమివ్వాలని మోదీ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్ చేరిక వల్ల ఆయా దేశాలతో పాటు జీ-20 సభ్యులకు కూడా ప్రయోజనం కలగడం ఖాయంగా కనిపిస్తోంది. అనేక దేశాలు ఆఫ్రికా కంట్రీస్ తో విడివిడిగా సంబంధాలు పెట్టుకోగా.. ఇప్పుడు సమిష్టిగా ఆఫ్రికన్ యూనియన్ తో మైత్రీ బంధాన్ని కొనసాగించే వీలు కలుగుతుంది. స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశం వస్తుంది.

ఆహా ఏమి రుచి…తిన్నా మైమరిచి..

జీ-20 ఆతిథ్యం అదిరిపోయిందని వచ్చిన విదేశీ ప్రతినిధులంతా వేనోళ్ల ప్రశంసించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చిన విందులో వంటకాలు రుచిరకంగా ఉన్న భారతీయ వంటలు రుచి చూసే అవకాశం వచ్చిందని చెప్పుకున్నారు. బంగారం, వెండి పాత్రల్లో వడ్డించిన విందులో స్టార్టర్ కింద మిల్లెట్స్‌తో చేసిన పాట్రమ్, స్పైసీ చట్నీ వేశారు. మెయిన్ కోర్సు కింద చిరుధాన్యాలు, పనసపండుతో చేసిన గాలెట్టె , గ్లేజ్‌డ్‌ ఫారెస్ట్‌ మష్రూమ్‌, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్‌రైస్‌, వివిధ రకాల బ్రెడ్‌లతోపాటు ముంబయి పావ్‌, బకర్‌ఖని వడ్డించారు. డెజర్ట్‌లో యాలకులు, ఊదలతో చేసిన మధురిమ అనే పుడ్డింగ్‌, ఫిగ్‌ పీచ్‌ కంపోట్‌, ఆంబేమొహార్‌ క్రిస్పీస్‌, పాలు-గోధుమలతో చేసిన నట్స్‌ ఉన్నాయి. పానీయాల్లో కశ్మీరీ ఖావా, ఫిల్టర్‌ కాఫీ, డార్జిలింగ్‌ టీ, పాన్‌ ఫ్లేవర్డ్‌ చాక్లెట్‌ ఏర్పాటు చేశారు.ఈ విందుకు మొత్తం 170 మందిని ఆహ్వానించగా.. విదేశీ ప్రతినిధులతో పాటు భారత కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.