ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి వరకు – ప్రధాని మోదీ మూడో ధీమా

ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి వరకు – ప్రధాని మోదీ మూడో ధీమా

ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ప్రధాని మోదీ. ఆయన ఏ పనిచేసినా, ఏ మాట చెప్పినా అందులో దృఢ నిశ్చయం కనిపిస్తుంది. ఆయన చెప్పింది చేస్తారు.. చేసేదే చెబుతారు. చెప్పారంటే చేయడం ఖాయమని ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మేకిన్ ఇండియా నుంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి వరకు దేశాన్ని పరుగులు పెట్టించిన నాయకుడు ఆయన. మిషన్ 2024 దిశగా బీజేపీ నేతృత్వ ఎన్డీయేను పరుగులు పెట్టిస్తోంది కూడా ఆయనేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

హ్యాట్రిక్ కొట్టడం ఖాయం…

తాను చేస్తున్న పని మీద పూర్తి విశ్వాసం ఉన్న నాయకుడు మోదీ. అంకితభావంతో పని చేస్తే, నిస్వార్థ సేవకు దిగితే సక్సెస్ దానంతట అదే వస్తుందని నమ్ముతారాయన. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన వరుసగా మూడో సారి విజయంపై ధీమాను ప్రకటించారు. దేశ ప్రజల మద్దతు తమకు మాత్రమే ఉందని ఆయన చెప్పుకున్నారు. మూడో సారి ప్రధానమంత్రిత్వంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దుతానని మోదీ చెప్పుకున్నారు. తొలిసారి తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని, రెండో సారి అధికారానికి రాగానే ఐదో స్థానానికి ఎగబాకామని గుర్తుచేశారు. తన థర్డ్ టర్మ్ లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను చేస్తామన్నారు.

అన్నింటా నెంబర్ వన్ అంటున్న మోదీ…

తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని చోట్ల అభివృద్ధి కనిపిస్తోందని మోదీ వివరించారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మించామన్నారు. పొడవాటి టన్నెల్ నిర్మించిన ఘనత తమదేనన్నారు. ఎత్తైన కొండలపై రోడ్లు వేసి రవాణా సౌకర్యాలు మెరుగు పరిచినది కూడా తామేనన్నారు. అతి పెద్ద స్టేడియం, అతి పెద్ద విగ్రహం కూడా తమ ఖాతాలోనే ఉందన్నారు. అదే భారతదేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు.

ప్రగతి పథంలో రైల్వేలు…

రైల్వేల అభివృద్దికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మోదీ గుర్తుచేసారు. ఆరవై ఏళ్లలో కేవలం 20 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు వేస్తే, తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 40 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ వేశామన్నారు. ప్రతీ నెల ఆరు కిలోమీటర్ల మెట్రో రైల్వే లైన్ వేస్తున్నామన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు లక్షల కిలోమీటర్ల రోడ్లు వేశామన్నారు. ఢిల్లీ విమానాశ్రయ సమర్థత ఏడాదికి ఐదు కోట్ల నుంచి ఏడున్నర కోట్లకు పెంచామన్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 150కి చేరిందన్నారు. ఇంత చేసినా విపక్షాలు విమర్శలు సంధిస్తూనే ఉన్నాయని, వాళ్లను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోదీ తేల్చేశారు.