కాంగ్రెస్ పార్టీ అంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. పార్టీ నేతల్లో రోజుకు పది మంది పక్క చూపులు చూస్తుంటే, అందులో సగం మంది వేరే పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ లో తగిన గౌరవం లభించక, అవకాశాలు లేక, ప్రజాసేవ చేసేందుకు అనుమతి రాక విసుగుచెంది నేతలు పలాయనమవుతున్నారు. కాంగ్రెస్ ఉండటం వృథా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి…
కరుణాకరన్ కూతురు పద్మజా వేణుగోపాల్….
దివంగత కేరళ మాజీ సీఎం కే. కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమై కాషాయ కండువా కప్పుకుని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానిిక రాజీనామా చేసిన తర్వాతే తాను బీజేపీలో చేరుతున్నానని పద్మజ ప్రకటించారు. పార్టీ మారడం లేదంటూ కొన్ని రోజుల క్రితం పెట్టిన ఫేస్ బుక్ పోస్టును ఆమె డిలీట్ చేసిన తర్వాతే ఢిల్లీ వచ్చారు.
మూడు సార్లు ఓడిన అనుభవం…
గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మజ సీపీఎం అభ్యర్థి చేతులో పరాజయం పాలయ్యారు. అంతకముందు కూడా రెండు సార్లు ఓడిపోయారు. పద్మజను కక్షగట్టి కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఓడిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. పద్మజ కూడా వాటిని ధృవపరిచిన సందర్భాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అనుకూలంగా లేవని, కేరళ యూనిట్లో తలెత్తుతున్న సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేదని ఆమె బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్ మునుపటిలా లేదని తన తండ్రి కరుణాకరన్ కూడా చెప్పేవారని ఆమె అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లోపించిందని కేవలం కుటుంబ పాలన నడుస్తోందని కూడా పద్మజా వేణుగోపాల్ అంటున్నారు..
గగ్గోలు పెడుతున్న సోదరుడు..
పద్మజా పార్టీ మారడంతో కాంగ్రెస్లో కల్లోలం మొదలైంది. ఆమె సోదరుడు మురళీధరన్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆయన పద్మజపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు చేర్చుకున్నందుకు బీజేపీని కూడా తప్పుపడుతున్నారు. ఆమె చేరడం వల్ల బీజేపీకి ఒనగూరే ప్రయోజనమేదీ లేదని ఆయన చెప్పుకుంటున్నారు. కేరళపై కూడా బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టినందునే పద్మజను పార్టీలో చేర్చుకున్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు కేరళలో బీజేపీ మూడో స్థానంలో ఉంది. ఈ సారి అక్కడి 20 లోక్ సభా స్థానాల్లో కొన్ని అయినా గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పద్మజ లాంటి వారిని చేర్చుకుని టికెట్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని అంచనా వేసిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో ప్రకటించే అభ్యర్థుల రెండో జాబితాలో ఆమె పేరు ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు….