గ్రామ సీమలు ఆర్థికంగా బలంగా ఉంటేనే గ్రామీణుల సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడుదల చేస్తూ ఉంటుంది. కానీ ఏపీ సర్కార్ ఈ నిధులను మళ్లించేసుకుని బటన్ నొక్కుడు పథకాలకు వాడుకుంటూండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. సర్పంచ్‌లు పోరుబాట పట్టారు. వారికి మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగింది. పలు రకాల ఆందోళనలకు ప్లాన్ చేస్తోంది.
ఆర్థిక కష్టాల్లో గ్రామ పంచాయతీలు
రాష్ట్రంలో 13,369 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో మేజర్ పంచాయతీల కన్నా మైనర్ పంచాయతీలే ఎక్కువ. ఇటీవల జనరల్ ఫండ్స్‌తో పాటుగా 14,15వ ఆర్థిక సంఘం నిధులు కూడా తమకు చేరడం లేదని ఆయా పంచాయతీ పాలక వర్గాలు వాపోతున్నాయి. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలకు రూ.7659 కోట్లు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చింది. అయితే ఈ నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యాయా అంటే.. ఏపీలోని ఒక్క సర్పంచ్ కూడా పైసా కూడా జమ కాలేదని చెబుతున్నారు. పంచాయతీ సీఎఫ్‌ఎంఎస్ ఖాతాల్లో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కనిపించలేదు. ఈ నిధులన్నింటినీ అక్రమంగా ప్రభు్తవం దారి మళ్లించేసింది.
విద్యుత్ చార్జీల పేరుతో మళ్లింపు
ఎప్పుడు కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులు వచ్చినా సర్పంచులకు తెలియకుండా విద్యుత్ ర్జీల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. దారి మళ్లించి సీఎఫ్‌ఎంఎస్ అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపించడం ప్రారంభించారు. నిజానికి ఈ నిధులను పంచాయతీలు ఖర్చు చేసి యూసీలు సమర్పించాలి. ప్రభుత్వం దారి మళ్లించేసుకోవడంతో గ్రామ పంచాయతీలు ఖర్చు చేయలేకపోయాయి. ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం యూసీలు సమర్పించలేకపోయింది పంచాయతీ తీర్మానం లేకుండా సర్పంచుల సంతకం లేకుండా నిధులు వెనక్కు తీసుకోవడం సరికాదు. అలా చేయడం సైబర్ నేరం కిందకు వస్తుంది. కానీ ప్రభుత్వ ఇష్టారాజ్యం అయిపోయింది.
విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల మాటంటి?
పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు గత 15 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయని, కానీ గతంలో ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏక మొత్తంగా విద్యుత్ సంస్థలకు బదలాయించలేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఒక్కపైసా విడుదల చేయకపోయినా కేంద్రం నుంచి లభిస్తున్న 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించేసుకోవడంతో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు వేల కోట్ల బకాయి ఉంది.. వాటిని చెల్లిస్తే సమస్యే ఉండదని చెబుతున్నారు.
పంచాయతీ నిధులపై ఏపీ సర్కార్ వ్యవహారానికి నిరసనగా…. సర్పంచ్‌లకు మద్దతుగా బీజేపీ పెద్ద ఎత్తున పోరాటానికి ప్లాన్ చేసుకుంటోంది. పదో తేదీన మహాధర్నా చేపడుతోంది. రాష్ట్రం దిగి వచ్చి పంచాయతీ నిధులు పంచాయతీలకు ఇవ్వకపోతే కేంద్రానికి కూడా ఆ తర్వాత ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి.