బంగ్లా సుందరీకరణకు రూ. 45 కోట్లు, బాబోయే కేజ్రీవాల్

ప్రజల కోసం పనిచేసేందుకు, అవినీతి రహిత పాలనను అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశామని అరవింద కేజ్రీవాల్ సహా పలువురు నేతలు చెబుతారు. ప్రజాధనం పైసా కూడా వృద్ధా కానివ్వబోమని డాంబికాలు పలుకుతారు. వాస్తవ స్వరూపం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఆఫ్ నేతలు ఇప్పుడు అవినీతికి, వృథా వ్యయానికి నిలువెత్తు సాక్ష్యాలుగా మారుతున్నారు..

కళ్లు బయర్లు కమ్మాల్సిందే..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసం సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంది. సుందరీకరణ పేరుతో దాని మరమ్మత్తుకు రూ. 45 కోట్లు వ్యయం చేసినట్లు ఇటీవలే వెల్లడైంది. డోయర్ పాలిష్, వియత్నాం పాలరాయి, ఖరీదైన కర్టెన్లు, అంతకంటే ఖరీదైన కార్పెట్లు కొనుగోలు చేసి.. సింపుల్ గా ఉండాల్సిన సీఎం బంగ్లాను విలాసవంతమైన భవనంగా మార్చేశారు. 2013లో అధికారానికి వచ్చినప్పుడు సింపుల్ గా జీవిస్తానని చెబుతూ ఎర్రబుగ్గకారును కూడా వాడని కేజ్రీవాల్ లో అంతలో ఎంత తేడా వచ్చిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జనానికి కనీస వసతుల్లేక ఇబ్బంది పడుతుంటే కేజ్రీవాల్ విలాసాలకు దిగారని బీజేపీ, కాంగ్రెస్ అంటున్నాయి. రోమ్ లో జనం చచ్చిపోతుంటే నీరో ఫిడేలు వాయిస్తున్నట్లుగా ఢిల్లీ పరిస్థితి ఉందని వాళ్లు వాపోతున్నారు..

అందలమెక్కిన అవినీతి

కేజ్రీవాల్ తొలి నాళ్లలో నిజాయితీగానే కనిపించినా.. పోగా పోగా అవినీతి అందలమెక్కింది. పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు ఇప్పటికే అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఢిల్లీ నుంచి దక్షిణాది వరకు విస్తరించిన స్కామ్ కూడా అదే కావచ్చు. సౌత్ గ్రూప్ చేయి పడిన రూ. 100 కోట్ల స్కామ్ లో కేజ్రీవాల్ అనుమానితుడిగానూ, సిసోడియా నిందితుడిగానూ ఉన్నారు. అవినీతి చేసేందుకు వీలుగా నిబంధనలనే మార్చేశారని కేజ్రీవాల్, సిసోడియాపై ఆరోపణలున్నాయి

పంజాబ్ గెలుపు ఎలా.. ?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం కుంభకోణం ముడుపులను పంజాబ్ కు మళ్లించి అక్కడ విచ్చలవిడిగా ఖర్చుపెట్టారని ఆరోపణలున్నాయి. భారీగా ఓటును నోటు వాడారని కూడా చెబుతున్నారు. అందుకే గెలిచారని లేని పక్షంలో లేనిపక్షంలో పంజాబ్ లో ఆప్ అంత సీన్ లేదని కూడా లెక్కలు కట్టారు.

దీనిపై చర్చ జరుగుతుండగానే బంగ్లా సుందరీకరణకు రూ. 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. కొవిడ్ పీక్ టైమ్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలెండర్లకు డబ్బులు లేక జనం నానా తంటాలు పడుతున్నప్పుడే .. కేజ్రీవాల్ విలాసాలకు డబ్బులు ఖర్చుపెట్టారని తెలుస్తోంది. కాకపోతే కేజ్రీవాల్ చర్యలు ఇప్పుడు బయట పడ్డారు. అందులోనూ విడ్డూరం ఏమిటంటే.. ఒక బంగ్లా సుందరీకరణకే రూ. 43 కోట్లు మంజూరు చేసి ఆ డబ్బులు చాలక మరో రెండు కోట్లు జత చేసి మొత్తం రూ. 45 కోట్ల వరకు వ్యయం చేశారు. ఇంటీరియర్ డెకరేషన్ కు మాత్రమే రూ. 11.30 కోట్లు ఖర్చు చేశారు. మార్బల్ ఫ్లోరింగ్ కు రూ. 6.02 కోట్లు ఖర్చయ్యింది. వంటగదిని అందంగా తీర్చిదిద్దేందుకు కోటి పది లక్షలు పోశారు. చెప్పుకుంటూ పోతే ఇంకా..ఇంకా చాలా ఖర్చులు చేశారు. మరి ప్రజా ధనాన్ని ఇలా వృధా చేసే నాయకులను ఏమనాలో ఓటరు దేవుళ్లే నిర్ణయించుకోవాలి…