వానాకాలంలో తినకూడని ఆహార పదార్థాలివే!

వర్షాకాలం మొదలైందంటే రోగాలకు వెల్కమ్ చెబుతున్నట్టే. ఈ సీజన్లో ఎక్కడ చూసినా జ్వరాలు, జలుబు, దగ్గు, అంటు వ్యాధులతో బాధపడేవారే కనిపిస్తారు. వర్షంలో తడవడం , దోమల బారిన పడటం, అనారోగ్యకరమైన ఆహారాలు తినడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఈ అనారోగ్యం నుంచి దూరంగా ఉండాలంటే జంక్ పుడ్ కి మాత్రమే కాదు మరికొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా వానలు తగ్గేవరకూ మీరు తినకూడని కొన్ని ఆహారాలివే అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మామిడి పండ్లను తినకూడదు
మామిడిపండ్ల సీజన్ వేసవి అని అందరికీ తెలుసు. కానీ వానలు మొదలయ్యాక కూడా మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో వచ్చే పండ్లను ఎక్కువగా తింటే బ్యాక్టీరియా పెరుగుదలకు, ఫంగల్ ఇన్ ఫెక్షన్లకు అవకాశం ఉంది.

పుచ్చకాయ తినకూడదు
పుచ్చకాయను వేసవిలో ఎక్కువగా తిన్నప్పటికీ సీజన్ తో సంబంధం లేకుండా తినేవారి సంఖ్య ఎక్కువే. వేసవితో పోలిస్తే వర్షాకాలంలో తక్కువ నీరు తాగుతారు. ఈ సీజన్‌లో కూడా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కానీ నీటి కొరతను తీర్చడానికి పుచ్చకాయ తినాలని దీని అర్థం కాదు. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో వీటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ పండ్లు త్వరగా పాడవుతాయి. సులభంగా కలుషితమవుతాయి.

పాల ఉత్పత్తులు తినొద్దు
వర్షాకాలంలో పాలు, పనీర్ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండడమే మంచిది. పెరుగు, మజ్జిగ ఆరోగ్యానికి మంచిది. అవి సులభంగా జీర్ణం కావడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

స్ట్రీట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి
స్ట్రీట్ ఫుడ్ రుచికరంగా ఉంటాయి. రారామ్మని అట్రాక్ట్ చేస్తాయి. కానీ వాటికి ఎంత దూరంగా ఉంటే అనారోగ్యానికి అంతదూరంగా ఉన్నట్టే. తేమ, బ్యాక్టీరియాతో కూడిన గాలి ఆ ఆహారాన్ని కలుషితం చేస్తుంది. ఇది తినడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

పచ్చి కూరగాయలు తినొద్దు
కొందరికి పచ్చి కూరగాయలు తినే అలవాటు ఉంటుంది. కానీ వానాకాలంలో అది సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు వీటిని ఉడికించిన తర్వాత తీసుకోవడమే మంచిది.

ఆకుకూరలు తినకపోవడమే మంచిది
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ వనాకాలంలో వీటిని తినవద్దంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వానలతో తేమ బాగా చేరి బ్యాక్టీరియా, ఫంగస్ లు ఆకుకూరలు, పండ్లపై వృద్ధి చెందుతాయి. అందుకే ఈ కాయంలో పండ్లు, ఆకుకూరలు తినడం తగ్గించాలి లేదంటే బాగా కడిగి తినాలి.

సీ ఫుడ్స్ వద్దు
వర్షాకాలంలో చేపలు, సముద్ర జీవులు సంతానోత్పత్తి సమయం. అందుకే ఈ సమయంలో సీఫుడ్స్ ని నివారించడమే మంచిది.

వేపుడు తినొద్దు
ఉడికించి చేసే కూరల కన్నా నూనెలో వేయించిన వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఆహా అని లిమిట్ లేకుండా లాగించేయాలి అనిపిస్తుంది. కానీ వేయించిన ఆహారానికి దూరం పాటించడమే ఆరోగ్యానికి మంచిది. సమోసాలు, హాట్ హాట్ చిప్స్ తినవద్దు..

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం