స్థానిక అంశాలపై దృష్టి పెట్టండి – ఎన్డీయే ఎంపీలకు మోదీ సలహా

స్థానిక అంశాలపై దృష్టి పెట్టండి – ఎన్డీయే ఎంపీలకు మోదీ సలహా

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. విపక్షాలన్నీ ఒకటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఐనా ఎన్డీయేకు దరిదాపులకు రాలేని పరిస్థితి ఉంది. మోదీ నేతృత్వ కూటమి రోజురోజుకు బలపడుతోంది. అలాగని ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదని ఎన్డీయేకు నాయకుడైన ప్రధాని నరేంద్ర మోదీ తేల్చేశారు. మునుపటి కంటే ఎక్కువ స్థానాలు సాధించి తీరాల్సిందేనని ప్రకటించేశారు. ఇందుకోసం తమ కూటమి ఎంపీలకు ఆయన అనేక అంశాల్లో దిశానిర్దేశం చేశారు.

పెళ్లిళ్లకు హాజరు కావాలి

కూటమిని ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా ప్రధాని మోదీ, ఎన్డీయే ఎంపీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటగా పడమటి ఉత్తర ప్రదేశ్, వ్రజ్, కాన్పూర్ – బుందేల్ ఖండ్ ప్రాంతాల ఎంపీలతో ప్రత్యేక భేటీ నిర్వహించి 2024 విజయం కోసం చేయాల్సిన పనులను వివరించారు. రామ్ మందిర నిర్మాణం గురించి చెప్పుకుంటూ కూర్చుంటే సరిపోదని జనంలోకి వెళ్లాలని ఆయన ఆదేశించారు. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి ఎక్కువ సమయం జనంతో గడపాలని ఆయన సూచించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు సైతం హాజరై జనంలో కలిసిపోవాలని చెప్పారు.ఏదేనా కారణం చేత బీజేపీ పట్ల, ఎన్డీయే మీద కోపంగా ఉన్న ప్రజలతో ఎక్కువ సమయం గడిపి వాస్తవ పరిస్థితులు వారికి వివరించి వీలైనంత త్వరగా పరిష్కారాన్ని సూచించాలని చెప్పారు.

సంకీర్ణ ధర్మమే బీజేపీ విజయ రహస్యం..

బీజేపీ చేసినన్ని త్యాగాలు ఎవరూ చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. యూపీఏలాగ తాము స్వార్థ కూటమి కాదని ఆయన ప్రకటించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన పార్టీకి బీజేపీ కంటే తక్కవమంది ఎమ్మెల్యేలున్నప్పటికీ ముఖ్యమంత్రిని చేశామని, ఐనా సంతృప్తి చెందకుండా కూటమి మార్చారని మోదీ గుర్తు చేశారు. పంజాబ్ లో ఒకప్పుడు అకాలీదళ్ తో పొత్తు ఉండేదని, బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అడగలేదని మోదీ చెప్పారు.

11 గ్రూపులుగా ఎన్డీయే ఎంపీలు

మోదీతో భేటీల కోసం ఎన్డీయే ఎంపీలను 11 గ్రూపులుగా విడదీశారు. ఆగస్టు 10 వరకు వరుస సమావేశాలు నిర్వహిస్తారు. బుధవారం జరిగే రెండో దఫా సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్, లక్షదీవుల ఎంపీలు పాల్గొంటారు. పొత్తు భాగస్వాముల మధ్య అవగాహన పెంచేందుకు ఈ మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రవాణా మంత్రి నితిన్ గడ్కర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశాల్లో పాల్గొంటారు.