రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రం కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటుకానుంది. దీనికోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పైలట్ శిక్షణ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టులో తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తోంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యవతకు చక్కటి అవకాశమని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కర్నూలు ఎయిర్ పోర్టు అనుకూలం
హైదరాబాదు, బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉండటంతో, కర్నూలు లోనూ ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. కర్నూల్ నుండి విజయవాడ, విశాఖ, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు నడపుతున్నారు. సుమారు 970 ఎకరాలలో 120 కోట్లతో ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కర్నూలు ఎయిర్ పోర్ట్ ను నిర్మించింది. రెండువేల మీటర్ల పొడవు 30 మీటర్ల వెడల్పుతో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేశా రు.
గతంలో హామీ ఇచ్చిన జ్యోతిరాదిత్య సింధియా
కర్నూలు విమానాశ్రయంలో పైలెట్ శిక్షణ కోసం ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీఓ) ఏర్పాటు చేయనున్నట్లు గతంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దేశంలో ఉన్న 24 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌లకు సరికొత్త శక్తినివ్వడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. కడప, లేదా కర్నూలు ఎయిర్ పోర్టుల్లో ఈ ట్రైనింగ సెంటర్ ను పెట్టాలని పరిశీలించారు. కర్నూలు అయితే బాగుంటుందని తుది నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
భారీగా ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ప్రయ్తనం
దేశంలో 17 విమానాశ్రయాల్లో పైలెట్ శిక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయనుండగా ఇందులో కడప లేదా కర్నూలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏపీలో తొలి పైలెట్ శిక్షణా కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు ఎయిరో అడ్వంచర్ స్పోర్ట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) కూడా గత ఏడాది ప్రతిపాదనలు సిద్ధంచేసింది. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉండటంతో కర్నూలులో పైలెట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.