ఉత్తుత్తి ఉదయ్ పూర్ డిక్లరేషన్ – నవ్వుల పాలయిన టీ కాంగ్రెస్ తొలి జాబితా!

రూల్స్ ఎందుకు పెట్టుకుంటారు ?. ఖచ్చితంగా పాటించడానికే. కానీ కాంగ్రెస్ మాత్రం ఉల్లంఘించడానికే పెట్టుకుంటుంది. కాంగ్రెస్ పూర్తిగా పతనమయ్యే దేశలో ఉదయ్ పూర్ లో సమావేశం అయింది. అక్కడ ఒక్క కుటుంబానికి ఒక్క టిక్కెట్టే కేటాయించాలని తీర్మానం చేశారు. ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. కానీ తెలంగాణకు వచ్చే సరికి ఆ డిక్లరేషన్ నవ్వుల పాలయింది. ఫిరాయించి పార్టీలోకి వచ్చిన మైనంపల్లి కుటుంబానికి రెండు టిక్కెట్లు, ఉత్తమ్ రెడ్డి కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించారు.

ఒక్క కుటుంబానికి ఒక్క టిక్కెట్ ఉత్తదే

కాంగ్రెస్ పార్టీ జరిపిన మేధో మథనం చింతన్ శివిర్​లో పార్టీ నేతల బంధువులకు టిక్కెట్లు ఇవ్వరు. అయితే, సంబంధిత బంధువు పార్టీలో కనీసం ఐదేళ్లు పనిచేసినట్లయితే వారికి పార్టీ టిక్కెట్ ఇవ్వవచ్చు. ఆ లెక్క ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు టిక్కెట్ దక్కినా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు.. ఆయన కుమారుడికి ఎందుకు టిక్కెట్ ఇచ్చారన్నది ఇప్పుడు డౌట్. మరి ఆపార్టీ వారు పెట్టుకున్న నియమాన్ని వారే ఉల్లంఘించినట్లు. అది ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటే.

జానారెడ్డి కి షాక్ ఒక్క టిక్కెట్

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి , ఆయన తనయుడు రఘువీర్ రెడ్డికి టిక్కెట్టును కోరారు. నాగార్జున సాగర్ నుండి జానారెడ్డి, మిర్యాలగూడ నుండి ఆయన తనయుడు రఘువీర్ నుండి బరిలోకి దింపాలని భావించారు. అయితే 2018 లో నాగార్జునసాగర్ నుండి జానారెడ్డికి మాత్రమే టిక్కెట్టు దక్కింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి జానారెడ్డి తనయుడికి బదులుగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కింది. ఈ స్థానం నుండి కృష్ణయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో కూడ జానారెడ్డి ఇద్దరు కొడుకులు రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ధరఖాస్తు చేస్తుకున్నారు. జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి ధరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి చిన్న కొడుకు జయవీర్ రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఈ దఫా జానారెడ్డి మాత్రం కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్దు చేసుకోలేదు. చివరికి ఆయనకు బదులుగా రఘువీర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చి సరి పెట్టారు.

కీలకమైన స్థానాల్లో ఖరారు కాని అభ్యర్థులు

కీలకమైన స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాలేదు. 119 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నా లేకపోయినా పట్టింపు ఉండని పాతబస్తీ నియోజకవర్గాల్లో తప్పిస్తే.. పోటీ ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను ఇంత వరకూ ప్రకటించలేదు. వారిని ప్రకటిస్తే.. కాంగ్రెస్ లో ఒక్క సారిగా సంక్షోభ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.