అయోధ్య ఆలయంలో మొదటి బంగారు తలుపు ఏర్పాటు!

అయోధ్య‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న రామ‌మందిరం ఈ నెల 22న ప్రారంభించ‌న‌నున్నారు. ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అయోధ్య రామ‌మందిరానికి మొద‌టి బంగారు త‌లుపును ఏర్పాటు చేశారు.

మొదటి బంగారు తలుపు ఏర్పాటు
యావత్ భారతావని అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం అయోధ్యలోని శ్రీరామమందిర ప్రారంభోత్సవం. రామజన్మభూమి మందిర్ ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. జనవరి 22వ తేదిన దివ్య ముహుర్తంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. వెయ్యేళ్ల వరకు చిరస్థాయిగా నిలిచిపోయే రామ మందిరం ప్రధాన ముఖద్వారంతో పాటు ఆలయానికి చుట్టుపక్కల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా అయోధ్య రాముడి ఆలయం ప్రధాన ద్వారానికి బంగారు తలుపు ఏర్పాటు చేశారు.

42 తలుపులకు బంగారు పూత
అయోధ్య రామాలయం గ‌ర్భ‌గుడి మొదటి అంత‌స్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న బంగారు త‌లుపును అమ‌ర్చారు. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయోధ్య శ్రీ‌రాముని ఆల‌యంలో మొత్తం 46 త‌లుపుల‌ను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో 42 త‌లుపుల‌కు బంగారు పూత పూయనున్నారు. మూడంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయం ఒక్కొక్క అంతస్తు 20అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి ఐదేళ్ల బాలరాముడిగా (శ్రీరామ్‌ లల్లా విగ్రహం)ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో శ్రీరామ్‌ దర్బార్‌ ఉంటుంది.

అయోధ్య రామ‌మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న‌ ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో పాటు 7,000 మందికి పైగా వ్యక్తులకు రామ‌మందిర ఆహ్వాన ప‌త్రిక‌లు అందాయి. రామ‌మందిర వేడుకల ఏర్పాట్ల‌ను సమీక్షించేందుకు అయోధ్యకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పరిశుభ్రత పాటించేలా కుంభ్ మోడల్ ను అమలు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. జనవరి 14న అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అతిరథ మహాశయుల మధ్య అత్యంత వైభవంగా గర్బగుడిలో కొలువుతీరనున్నాడు రామయ్య.