కాంగ్రెస్ కా హాత్ ఆమ్ ఆద్మీ కే సాథ్.. అని ఒకప్పుడు ఆ పార్టీ చెప్పుకునేది. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. హస్తం పార్టీ సామాన్యుల చేయి వదిలేసి చాలా రోజులైంది. దేశంలో ఎక్కడైనా చివరకు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్లోనైనా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రకాలుగా కాంగ్రెస్ తమను మోసం చేసిందని రాజస్థాన్ రైతులు అంటున్నారు…
ఛురులో అన్నదాతల కన్నీరు..
రాజస్థాన్లోని ఛురు జిల్లాలో కూడా నవంబరు 25న పోలింగ్ జరుగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వస్తే మాకేమిటి, ఎవరు అధికారంలో ఉంటే తేడా ఏమిటన్నట్లుగా అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మరీ అధ్వాన్నంగా తయారైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. థార్ ఎడారికి ముఖద్వారంగా భావించే ఛురులో వ్యవసాయం బాగానే సాగుతుంది. అక్కడ శెనగలు, పెసలు పండించి ఎగుమతి చేస్తారు. ఇప్పుడు విత్తనాలు వేసే పనిలో బిజీగా ఉన్న రైతులు మాత్రం ఎన్నికల ప్రక్రియపై పెదవి విరుస్తున్నారు. రాజకీయ నాయకుల కంటే దేవుడ్ని నమ్ముకోవడం నయమని పొలం పనిచేసుకునే రైతులు అంటున్నారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటికి హామీ ఇచ్చిందని, చుక్కు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు.
వ్యవసాయ విద్యుత్ అంతంత మాత్రమే …
ఉచిత విద్యుత్ పేరులో అశోక్ గెహ్లాట్ బాకా ఊదేసుకున్నారు. వాస్తవానికి ఎనిమిది గంటలు కూడా కరెంట్ రావడం లేదు. దానితో పొలం తడుపుకునేందుకు డీజిల్ మోటార్లు వాడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఖర్చు తడిసి మోపెడవుతోందని గగ్గోలు పెడుతున్నారు. మద్దతు ధర, పంట బీమా ఒట్టి బూటకమని తేలిపోయింది. పంట బీమా.. తాము పెట్టే ఖర్చులకు వర్తించదని రైతులు తేల్చేశారు. వ్యవసాయం తప్పితే వేరు వృత్తి తెలియని తమ పరిస్థితి ఆగమ్య గోచరమైందని రైతుల వాదన. మద్దతు ధరకు తాము పెట్టే ఖర్చులకు పొంతన లేదని చెబుతున్నారు.
ఈ సారి గెలుస్తామంటున్న బీజేపీ
రాజస్థాన్ ఎడారిలో ఎండాకాలం భరించరాని ఎండ ఉంటుంది. చలికాలం ఎముకలు కొరకే చలి పుడుతుంది. విపరీత వాతావరణ పరిస్థితులతో శతమతమవుతూనే రైతులు జీవనం సాగిస్తున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నిండే రోజులు రాబోతున్నాయని బీజేపీ ధైర్యం చెబుతోంది. ఇప్పటి దారా ఛురు ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ ను నమ్ముకుంటే లాభం లేదని ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. దానితో బీజేపీకి అవకాశాలు పెరిగాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర సింగ్ రాథోడ్ ఈ సారి తాము గెలిచి చూపిస్తామంటున్నారు. రైతుల కోసం ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చుతామని ప్రకటించారు. ఏం జరుగుతుందో చూడాలి మరి…