తెలుగు రాష్ట్రాల్లో ఎండా కాలం వర్షాలు దంచుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజన్ కాని సీజన్. దీంతో పంటలు ఆరు బయటే ఉన్నాయి. ప్రభుత్వాలు వర్షాలు వస్తాయని అప్రమత్తం చేయలేదు. అంతకు మించి తగిన జాగ్రత్తలూ చెప్పలేదు. కనీస ఏర్పాట్లూ చేయలేదు. ప్రభుత్వాలు తన కనీస బాధ్యతలను గాలికి వదిలేశాయి. ప్రకృతి పరంగా ఏం జరిగితే తాము ఎలా బాధ్యత వహిస్తామని విచిత్రమైన వాదనలకు దిగుతున్నారు.
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు
గత కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణలో అకాల వర్షాలు పడుతున్నాయి. ఇది వర్షాకాలం కాదు. ఎండా కాలం. చేతికొచ్చేపంటలు పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి. కళ్లాల్లో ఆరబెట్టుకున్న మిర్చి లాంటివి తడిచిపోయాయి. ధాన్యం లాంటి వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇది ఓ విపత్తు లాంటిది. కానీ రైతుల్ని పరామర్శించేవారే వారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చేవారే లేరు. కనీసం వాతావరణ హెచ్చరికలపై ముందస్తు సూచనలు చేసి..రైతులకు కనీసం పట్టాల్లాంటివి పంపిణీ చేసే ఆలోచన కూడా చేయలేదు. ఏ ప్రభుత్వమూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని.. ఏడాదికి రూ. ఏడు వేలు ఇచ్చి… నట్టేట ముంచేశారని వారు మథనపడుతున్నారు. ఏపీలో అసలు అధికారులు పంట నష్టం అంచనాలు కూడా వేస్తున్నారో తెలియదు. తెలంగాణలో .. ఇదిగో పరిహారం అని మభ్య పెడుతున్నారు.
పరిహారం పేరుతో తెలంగాణ సర్కార్ మోసం – చలనం లేని ఏపీ సర్కార్ !
ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగితే..వెంటనే కేసీఆర్ పర్యటించి.. ఎకరాకు రూ. పదివేల చొప్పున ప్రకటించారు. కానీ ఎవరికీ అందలేదు. ఆ విషయం బయటకు రాకుండా సెక్రటేరియట్ ప్రచార సంరంభంలో అందర్నీ పడేశారు. ఇప్పుడు మళ్లీ వర్షాలొచ్చాయి. మరిన్ని లక్షల ఎకరాల్లో పంట మునిగింది. ఇప్పటికీ రైతులను మభ్య పెడుతున్నారు. పరిహారం ఇస్తామంటున్నారు. కానీ ఇస్తారో లేదో తెలియడం లేదు. ఏపీలో పరిస్థితి మరీ దారుణం. తుపానులు ఆపలేమని వ్యవసాయ మంత్రి వాదిస్తున్నారు. తుపాలను ఆపలేకపోవచ్చు కానీ.. మందస్తు జాగ్రత్తలు తీసుకోవడం.. నష్టపోయిన వారికి సాయం అందించకుండా ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలువస్తున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో ఎన్నో విపత్తులు రైతుల్ని అతలాకుతలం చేశాయి. కానీ ఒక్క సారంటే ఒక్క సారీ పరిహారం ఇవ్వలేదు. సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కూలిపోతేనే పరిహారం ఇవ్వలేకపోయారు. వారిని రోడ్డున పడేశారు. ఇప్పుడు పరిహారం అంచనా వేస్తున్నామని అదనీ.. ఇదనీ చెబుతున్నారు. కానీ పరిహారం ఇస్తామని మాత్రం చెప్పడం లేదు.
నాలుగేళ్లలో చితికిపోయిన రైతులు !
రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు నాలుగేళ్లలో చితికిపోయారు. రైతులు బాగుండాలంటే.. ముందుగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేయాలి. కానీ ఈ నాలుగేళ్లలో నీళ్ల దగ్గర్నుంచి పంట అమ్ముకునేవరకూ ఏ దశలోనూ రెండు ప్రభుత్వ వ్యవహారాలు రైతలకు అనుకూలంగాలేవు. నిర్ణయాలన్నీ గడువు తీరిన తర్వాత తీసుకున్నారు. మద్దతు ధర స్థిరీకరణ నిధి పెట్టలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తాము రైతు లను నట్టేట ముంచాయి. దీనికి ఆయా ప్రభుత్వాల విధానాలే కారణం. ఫలితంగా రైతాంగం .. సంక్షోభంలో కూరుకుపోయింది.