కాంగ్రెస్ నేతలు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నారు. కర్ణాటకలో ప్రతీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి ఏదోక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటారు. అందులోనూ పేదలను, రైతులను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఐనా సరే సీఎం సిద్ధరామయ్య గానీ, కాంగ్రెస్ అధిష్టానం గానీ వారిని మందలించడం లేదు. వారిని కనీసం వారించడం లేదు. పైగా అధిష్టానం తీరు వారిని ప్రోత్సహించినట్లుగానే ఉంటోంది…
రైతులు కరువు రావాలనుకుంటారా…
రైతులు కరువు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మాటలు వింటేనే ఒళ్లంతా కంపరం ఎత్తాల్సిందే. కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.కర్ణాటకలో కృష్ణా నీరు ఉచితంగా అందుతుందని, విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారని,ఎరువులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, రుణ మాఫీ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యకాలిక రుణాలపై వడ్డీని సిద్దరామయ్య ప్రభుత్వం రద్దు చేసిందని శివానంద పాటిల్ గుర్తు చేశారు. ఐనా రైతులు మాత్రం ప్రతీ ఏటా కరువు రావాలని ఎదురుచూస్తున్నట్లు ఆయన అన్నారు. ఉచితాల కోసం, మాఫీల కోసం వాళ్లు కరువు రావాలనుకుంటున్నారన్నది శివానంద్ పాటిల్ విశ్లేషణ.
ఎక్స్ గ్రేషియా కోసం ఆత్మహత్యలంటూ కారు కూతలు…
కర్ణాటకలోని 236 తాలూకాల్లో 223 చోట్ల ఈ ఏడాది కరువు విలయ తాండవమాతోంది. చుక్క నీరు లేక రైతులు అల్లాడిపోతున్నారు. వారి పట్ల సానుభూతి చూపాల్సిన కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పైగా గతంలో కూడా శివానంద్ పాటిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… కుటుంబానికి ఎక్స్ గ్రేషియా వస్తుందన్న ముందస్తు ఆలోచనతో వారు చనిపోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు..
మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్..
బాధ్యతా రహితంగా మాట్లాడే చక్కెర శాఖా మంత్రి శివానంద్ పాటిల్ ను వెంటనే సీఎం సిద్దరామయ్య పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది..లేని పక్షంలో శివానంద్ వ్యాఖ్యలను ప్రభుత్వ నిర్ణయాలుగా పరిగణించాల్సి ఉంటుందని బీజేపీ నేత సీ. అశ్వథ నారాయణ్ హెచ్చరించారు. రైతుల పట్ల కాంగ్రెస్ కు బొత్తిగా గౌరవం లేదని ఆయన ఆరోపించారు. అయితే బీజేపీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేసింది. మంత్రి శివానంద్ కూడా రైతు బిడ్డేనని వివరణ ఇచ్చింది.