కర్ణాటకలో రైతు ఆత్మహత్యలు – పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

అన్నదాతల ఆవేదన ఆకాశాన్ని అంటుతోంది. వర్షాలు పడక పంటలు వేయలేని దుస్థితి వచ్చసేంది. వ్యవసాయం తప్ప వేరే పని తెలియని కర్ణాటక రైతులకు దిక్కుతోచటం లేదు. వారు ఆత్మహత్యల బాట పడుతుంటే సిద్దరామయ్య ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

రెండు నెలల్లో 42 ఆత్మహత్యలు

విజయనగర జిల్లాలో అన్నక్క (60) అనే ఉల్లి రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వరుసగా మూడేళ్లు పంట రాకపోవడం ఈ ఏడాది కూడా వర్షాలు లేకపోవడంతో అప్పులు పెరిగి గత్యంతరంలో లేక తనువు చాలించింది. గత రెండు నెలల్లో కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 42 మంది వ్యవసాయదారుల్లో అన్నక్క ఒకరు. ఇక గదక్ జిల్లా హుల్లూరు గ్రామంలో మల్లికార్జున్ అంగాడీ (36) తాను తీసుకున్న రూ. 16 లక్షల లోన్ కట్టలేక పురుగుల మందు తాగి చనిపోయాడు. వేలాది మంది రైతులు వడ్డీలు సైతం కట్టలేని దుస్తితిలో ఉన్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలో విచిత్ర పరిస్థితులు

ఈ ఏడాది దేశంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలు వస్తున్నాయి. అక్కడ వేసిన పంట నీట మునిగిపోయింది. దక్షణాదిలో రుతుపవనాలు వచ్చి నెల దాటినా వర్షాలు పడటం లేదు. కారుమబ్బులు కనిపించడమే తప్ప కురవడం లేదు. దానితో సాగు నీరందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు సార్లు విత్తనాలు చల్లి నిరాశ గురైన రైతులు కర్ణాటక నిండా కనిపిస్తున్నారు.కాలువల్లో నీరు రాక పంట వేయలేని పరిస్థితి రావడం వరుసగా ఇదీ రెండో ఏడాది.

సిద్దూపై విపక్షాల ఆగ్రహం

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 42 మంది రైతులను ఆత్మహత్య చేసుకుంటే మహాకూటమి మీటింగ్ అంటూ సిద్దరామయ్య బిజీగా ఉన్నారని జేడీఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. రైతులకు ధైర్యం చెప్పే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదని కుమారస్వామి అంటున్నారు. హైదరాబాద్ – కర్ణాటక, దక్షిణ కర్ణాటక రెండు చోట్ల రుతుపవనాలు మొహం చాటేస్తే ప్రభుత్వు కూడా ఉదాసీనంగా ఉందని బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ అన్నారు. రాజకీయాలు, అధికారుల బదిలీతో డబ్బులు దండుకోవడం మినహా చేస్తున్నదీ శున్యమని ఆయన ఆరోపిస్తున్నారు.

సాయం కోసం రైతుల ఎదురుచూపు

కన్నడ రైతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు. చిన్నకారు, సన్నకారు రైతులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం గానీ, అధికారులు గానీ రైతుల దగ్గరకు వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. వారి వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.