మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు క్రికెట్ పరిభాషలో కొనసాగుతున్నాయి. వైరి వర్గాలు గుగ్లీలు, బౌన్సర్లు, స్టయిట్ బ్యాట్ అంటూ క్రికెట్ భాషలో ఆరోపణలు సంధించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన ఒక్క నిజంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉక్కిరిబిక్కిరై ఖంగుతిన్నారు. దిక్కుతోచక డొంక తిరుగుడు సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఓపికలేకపోయినా తొడకొడుతున్నారు…
డిప్యూటీ సీఎం వ్యాఖ్యల కలకలం
రాష్ట్రంలో 2019 రాజకీయ సంక్షోభంపై నాలుగు రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టారు. పవార్ తమను సపోర్టు చేసేందుకు అంగీకరించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేశామని చెప్పారు. ఆఖరి నిమిషంలో మాట మార్చిన పవార్ డబుల్ గేమ్ ఆడారాని ఆయన క్రీడలో అజిత్ పవార్ బలైపోయారని ఫడ్నవీస్ ఆరోపించడంతో ఎన్సీపీ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది.
కుట్ర బయట పడటంతో గుగ్లీ మాట..
పవార్ ద్వంద్వ నీతిని, నమ్మక ద్రోహాన్ని ఫడ్నవీస్ బయటపెట్టడంతో ఎన్సీపీ నేత నీళ్లు నమిలే పరిస్థితి వచ్చింది. అలా కాదు.. నేనే వారిని ట్రాప్ లో పడేసి బజారుకీడ్చానని రాజకీయ కురువృద్ధుడు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులను కలిసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే ఫడ్నీవీస్ ను ఎక్స్పోజ్ చేసేందుకే అప్పుడు అలాంటి గుగ్లీ విసిరానని ప్రకటించేశారు. పైగా ఫడ్నవీస్ ఎందుకు అర్థరాత్రి ప్రమాణ స్వీకారం చేశారో, అంతలోనే ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలంటూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు తంటాలు పడుతున్నారు.ఫడ్నవీస్ కు, బీజేపీకి అధికార దాహం పెరిగిపోయిందని చెప్పేందుకే తాను అలా చేయాల్సి వచ్చిందని అంటూ కొత్త నాటకానికి తెరతీశారు.
ప్లీజ్ వెయిట్ ఫర్ బౌన్సర్
మొదటి నుంచి శరద్ పవార్ తీరు అనుమానాస్పదంగానే ఉంది. సోనియా ప్రధాని కావడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్సీపీ పెట్టుకున్న ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీతోనే జతకట్టారు. ఇప్పుడు కూడా బీజేపీ పట్ల ఆయన అదే తీరును పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీతో అజిత్ పవార్ చేతులు కలపడం వెనుక పవార్ ఆశీస్సులున్నాయని ఫడ్నవీస్ వ్యాఖ్యలు, పవార్ సమాధానంతో తేలిపోయింది. 2019లో ఫడ్నవీస్, అజిత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిసి కూడా ఆయన ఏమీ తెలియనట్లున్నారు. కాంగ్రెస్, శివసేన ఆగ్రహం చెందడంతో తూచ్ అంటూ వారి పక్కనచేరిపోయి అజిత్ పవార్ ఇమేజ్ ను పూర్తిగా డేమేజ్ చేసేశారు. శరద్ పవార్ బీజేపీతో చర్చలకు, వారితో పొత్తుకు ఒప్పుకున్నందుకే అజిత్ ధైర్యంగా అటు వైపుకు వెళ్లగలిగారని తాజా పరిణామాలు చెప్పకనే చెప్పాయి. ఈ వాస్తవాలను తప్పుతోవ పట్టించేందుకు పవార్ ఇప్పుడు గుగ్లీ వేశానని సంబరపడిపోతున్నారు. అయితే బీజేపీ తిరుగులేని కౌంటర్ రెడీ చేస్తోంది. పవార్ దొంగనాటకాన్ని బయట పెట్టే బౌన్సర్ ను ఫడ్నవీస్ స్వయంగా విసురుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రేపో మాపో మాహారాష్ట్ర పిచ్ పై ఫడ్నవీస్ బౌలింగ్ మళ్లీ మొదలవుతుంది..