తవ్వకాల్లో వెలుగుచూసిన దేవాలయం – ఇక్కడ తీర్థం చాలా పవర్ ఫుల్!

శివుడి వాహనం నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా దర్శనం చేసుకునేది నంది విగ్రహాన్నే. నంది కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుడిని దర్శనం చేసుకుంటారు, నంది చెవిలో వారి కోరికలను విన్నవించుకుంటారు. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే నిత్యం నంది నోటి నుంచి నీరు శివలింగంపై పడుతుంది. ఈ అద్భుతం ఎక్కడుంది? అక్కడ ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం…

తవ్వకాల్లో వెలుగుచూసిన దేవాలయం
మల్లేశ్వర స్వామి
బెంగళూరు మల్లేశ్వరంలో కొలువైన మల్లేశ్వర స్వామి ఆలయం వందల ఏళ్లుగా ఆధ్యాత్మిక శోభతో వెలుగుతోంది. పరమశివుడికి అంకితమైన 17 వ శతాబ్దం నాటి ఆలయం ఇది. కొందరి పరిశోధనల ప్రకారం ఈ ఆలయం 400 సంవత్సరాల నాటిదిగా చెబితే మరికొందరు మాత్రం ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెబుతున్నారు. 1997లో మల్లేశ్వరంలోని కాడు మల్లేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న వీధిని వెడల్పు చేసే సమయంలో ఓ నంది విగ్రహం బయట పడింది. ఆ ప్రదేసంలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు జరిపగా ఓ దేవాలయం వెలుగుచూసింది.

నందీశ్వర తీర్థం
ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ నందీశ్వర తీర్థం. ఇక్కడ నీరు నిరంతరం నంది విగ్రహం నోటి నుంచి ప్రవహిస్తూ శివలింగం మీద పడుతుంది. ఈ నీరు వృషభవతి నదినుంచి వస్తుందంటారు కానీ స్పష్టమైన మూలం మాత్రం కనుక్కోలేకపోయారు. శివలింగంపై పడిన నీరు కిందున్న కళ్యాణి లో చేరుతుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉండే స్వామి ఆలయం అంతర్భాగం బంగారు రంగుతో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఆలయ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నంది నోటి నుంచి పడుతున్న శుద్ధ జలం మనం ఫిల్టర్ చేసే నీరు కన్నా కూడా శుద్ధంగా వుంది.

దక్షిణ ముఖంగా నందిముఖం
ఈ ఆలయంలో ఉన్న నంది ముఖం దక్షిణం వైపుకి ఉండగా, ఆ నంది నుంచి వచ్చే నీటిని పవిత్ర జలంలాగ భావిస్తూ ఆ నీటినే తీర్థంగా తీసుకుంటారు. నంది నుంచి శివలింగంపై పడిన నీరు పక్కనే ఉండే కొలనులోకి చేరుతాయి. దీనినే కళ్యాణి అని పిలుస్తారు. అందుకే ఈ దేవాలయానికి శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

నంది నుంచి నీరు రావడం ఒకటి…ఆ నీరు నేరుగా శివలింగంపై పడడం మరొకటి… ఇవెలా జరుగుతున్నాయో మిస్టరీగా మిగిలిపోయినా అదంతా శివలీల అంటారు భక్తులు…

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..