దీదీని టెన్షన్ పెడుతున్న మాజీ జడ్జి

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వీర వేడిమీదున్నాయి.తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని నేలకు దించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎత్తుగడలతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్టానం ప్రయోగాలు చేయడమే కాకుండా, ప్రజల విశ్వాసాన్ని పొందే అవకాశం ఉన్న వారికే టికెట్లిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో విజయావకాశాలున్న వారికే బీజేపీ టికెట్ లభిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…

రాజీనామా చేసిన వెంటనే గంగోపాధ్యాయకు టికెట్…

అభిజిత్ గంగోపాధ్యాయ ఇంతకాలం కోల్ కతా హైకోర్టు జడ్జిగా ఉన్నారు. అనేక కీలక కేసుల్లో సంచలనాత్మక తీర్పులు ఇచ్చారు. అవినీతి ఎక్కడ ఉన్నా బయటకు లాగి మరీ తీర్చులు చెప్పారు.ఆయన తీర్పుల కారణంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న మాట వాస్తవం. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస కమిషన్ లో టీచర్ల నియామక స్కాంను సీబీఐ చేత విచారణ జరిపించాలని అభిజిత్ గంగోపాధ్యాయ ఇ్చచిన తీర్పుతో దీదీ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది, స్కామ్ చేసిన వారినందరినీ బయటకు లాగేందుకు ఆ తీర్పు దోహదం చేసింది. అలాంటి ప్రజారంజకమైన తీర్పులు ఇచ్చిన అభిజిత్ ఎన్నికల ముందు పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరి ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు….

మాజీ జడ్జిపై సోషల్ మీడియా వారియర్ పోటీ

అభిజిత్ గంగోపాధ్యాయకు బీజేపీ టామ్లూక్ టికెట్ ఇచ్చి ప్రచారం చేసుకోమన్నది. దానితో ఏం చేయాలో దీదీకి దిక్కుతోచడం లేదు. పైగా టామ్లూక్ ఇప్పుడు బీజేపీ కంచుకోటగా మారుతోంది. దానితో ఆమె కాస్త వ్యూహం మార్చారు. తృణమూల్ సోషల్ మీడియా హెడ్ అయిన 27 ఏళ్ల దేబాంక్షు భట్టాచార్యను మాజీ జడ్జిపై పోటీకి నిలబెట్టారు.2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ప్రచారానికి ఖేలో హోబే పాటను రాసినదీ దేబాంక్షునే అని మరిచిపోకూడదు. దానితో 2022లో పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. గంగోపాధ్యాయ తన తీర్పుల ద్వారా యువత జీవితాలను నాశనం చేశారని, ఒక యువకుడిని నిలబెట్టడం ద్వారా ఆయనకు బుద్ధి చెబుతున్నామని దీదీ అంటున్నారు.

బలపడుతున్న బీజేపీ

టామ్లూక్ ఒకప్పుడు వామపక్షాలకు కేంద్ర బిందువు, 2009 నుంచి అది తృణమూల్ ఖాతాలో ఉంది. అయితే అందులో ట్విస్ట్ కూడా ఉంది. 2009,2014లో అప్పట్లో మమతకు అత్యంత సన్నిహిత నాయకుడైన సువేందు అధికారి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. 2016లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన లోక్ సభ పదవిని వదులుకున్నారు. లోక్ సభ ఉప ఎన్నికల్లో సువేందు సోదరుడు దిబ్యేందు పోటీ చేసి తృణమూల్ ఎంపీ అయ్యారు. 2019లో కూడా ఆయనే గెలిచారు. సువేందు బీజేపీలో చేరిపోయినా ఆయన మాత్రం తృణమూల్ లోనే ఉంటూ ఇటీవలే రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అందుకే 15 ఏళ్లుగా తృణమూల్ ఖాతాలో టామ్లూక్ కనిపించినా….అదీ సువేందు ఫ్యామిలీ ల్యాండ్ గా భావించాలి. ఇప్పుడు సువేందు బీజేపీలో ఉన్నందున .. లోక్ సభ ఎన్నికల్లో జరగబోయేది ఏమిటో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అందుకే దీదీ టెన్షన్ పడిపోతున్నారు..