శని బాధల నుంచి విముక్తి కోసం ప్రతి శనివారం ఇలా చేయండి!

శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ప్రత్యక్ష దైవం అయిన సూర్యుడు, ఛాయాదేవికి పుట్టిన సంతానం శని. అందుకే ఛాయాపుత్రుడు అనికూడా అంటారు.
బతికి ఉన్నంతకాలం చేసిన తప్పులకు మరణానంతరం శిక్షలు వేస్తాడు శనిదేవుడి అన్నయ్య యమధర్మరాజు. కానీ తమ్ముడు శని మాత్రం జీవుడు బతికిఉండగానే తన ప్రతాపాన్ని చూపిస్తాడు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపేలా చేస్తాడు. నమ్మక ద్రోహం, వెన్నుపోటు,హింస,పాపం, అన్యాయ మార్గాలను అనుసరించేవారికి వారి కర్మ ఫలిత ఆధారంగా శనిదేవుడు వారిని ఎక్కువ ఇబ్బంది పెడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటాయి. శని ప్రభావం పడితే అన్న యముడుని దాదాపు పరిచయం చేసి తీసుకొస్తాడని( అంటే చావు అంచుల వరకూ తీసుకెళ్లి తీసుకొస్తాడని) అంటారు. శని పట్టకుండా ఎవ్వరూ ఆపలేరు కానీ ఆ ప్రభావం తగ్గించేందుకు, శనని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని నియమాలు పాటించడం, కొన్ని శ్లోకాలు పఠించడం మంచిదంటారు పండితులు.

శనివారం పాటించాల్సిన నియమాలు
-శ‌నివారం అంటే శ‌నీశ్వ‌రుడికి ప్రీతిక‌ర‌మైన‌ది. త్ర‌యోద‌శి తిథితో క‌లిసి ఉన్న‌దైతే అది అత్యంత శుభ‌క‌రం. ఈ రోజున చేసే శివార్చ‌న‌, శ‌నైశ్వ‌రార్చ‌న శుభ‌ఫ‌లితాల‌ను ఇస్తుంది.

-శ‌ని బాధలు తీవ్రంగా ఉన్నవారు… ప్ర‌తీ శ‌నివారం ఇనుప గిన్నెలో నువ్వుల నూనె వేసి దానిలో మీ ముఖాన్ని చూసుకుని ఆ నూనెను శ‌నిదేవుడి గుడిలో కానీ, న‌వ‌గ్ర‌హాలు ఉన్న గుడిలో కానీ ఇవ్వాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తీ శ‌నివారం చేస్తే కొద్దిరోజుల‌లోనే శ‌నిగ్ర‌హ‌బాధ‌ల నుంచి విముక్తిని పొంద‌వ‌చ్చని చెబుతారు పండితులు

-ప్ర‌తీ శ‌నివారం రోజున నూనెతో చేసిన చ‌పాతీల‌ను న‌ల్ల‌కుక్క‌కు తినిపించాలి. ఇలాంటివి చిన్న చిన్న ప‌నుల‌ను చేయ‌డం వ‌ల్ల శ‌నీశ్వ‌రుడి బాధ‌ల‌నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

-శ‌నివారం రోజున న‌ల్ల నువ్వులు, న‌వ ధాన్యాలు, ఇనుప వ‌స్తువు, న‌ల్ల‌ని గొడుగు, నువ్వుల నూనె లాంటివి దానం చేయ‌డం వ‌ల్ల శ‌నిగ్ర‌హ బాధ‌ల నుంచి ఉపశమనం లభిస్తుంది

-శ‌నిగ్ర‌హ బాధ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ట్ల‌యితే శ‌నీశ్వ‌రుడికి తైలంతో అభిషేకం చేసి, పూజ చేసి…ఓం ప్రాం ప్రీం సః శ‌నైశ్చ‌రాయ న‌మః అనే మంత్రాన్ని108 సార్లుగానీ లేదా య‌థాశ‌క్తిగా క‌నీసం 21 కి త‌గ్గ‌కుండా జ‌పం చేయాలి. ఆ తర్వాత శ‌ని చాలీసా చ‌దివి, హార‌తి ఇవ్వాలి. పేద‌వారికి స‌హాయం చేయాలి.

-ప్ర‌తి శ‌నివారం రోజు ఉద‌యం, సాయంత్రం రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేయ‌డం వ‌ల్ల శ‌నిగ్ర‌హ బాధ‌లు తొలుగిపోవడంతో పాటూ ఆర్థికంగా వృద్ధి చెందుతారు.

-హ‌నుమంతుడి పూజ చేస్తున్న వారిని శ‌నీశ్వ‌రుడు బాధించ‌డు. అందుకోసం శ‌నీశ్వ‌రుడి పూజ మాత్ర‌మే కాదు హ‌నుమంతుడి పూజ కూడా చేస్తే శ‌ని పెట్టే బాధ‌ల‌నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. హ‌నుమాన్ చాలీసా, సుంద‌రాకాండ పారాయ‌ణం లాంటివి చ‌ద‌వ‌డం వ‌ల్ల అటు హ‌నుమంతుడు, ఇటు శ‌నీశ్వ‌రుడు ఇద్ద‌రి కృప‌కు పాత్రులుకాగలరు

శని ప్రభావం తగ్గించేందుకు పఠించాల్సిన శ్లోకాలు

ఓం శం శనయేనమ
ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః
కోణస్ధః పింగళ బభ్రు
కృష్ణో రౌద్రంతకో యమ:
సౌరి శనైశ్చరో మంద:
పిప్పలాదేవ సంస్తుత:

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం

ఓం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష:
శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని

శని గాయత్రీ మంత్రం:
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్

శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.