దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాలు ఉండేవారికి..కొన్ని ఆలయాల విశిష్టతల గురించి, అక్కడ మహిమలు, అంతుచిక్కని మిస్టరీల గురించి వివరిస్తే చాలు అర్థమవుతుంది. అలాంటి వాటిలో ఒకటి కట్టిల్ మొక్కతిల్ భగవతి అమ్మవారి ఆలయం.
రెండు దశాబ్దాళ క్రితం ఇండోనేషియా తీరంలో ఏర్పడిన సునామీ చాలా దేశాల తీర ప్రాంతాలను ముంచేసింది. తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేసింది. కేరళ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అయితే కొల్లాం జిల్లాలో అరేబియా సముద్రానికి, జలమార్గానికి మధ్య ఉన్న చిన్న దీవిలో కొలువైన అమ్మవారి ఆలయం మాత్రం అలానే చెక్కుచెదరకుండా ఉండిపోయింది. కేరళలో కొల్లాం జిల్లా శంకర మంగళం సమీపంలో ఉందీ కట్టిల్ మెక్కతిల్ భగవతి అమ్మవారి ఆలయం. అమ్మవారి మహిమ కారణంగానే సునామీ ఇక్కడ తాకలేకపోయిందని భక్తులు విశ్వశిస్తారు.
స్థలపురాణం
స్థలపురాణం ఏంటంటే కట్టిల్ మొక్కతిల్ అమ్మవారు ఇక్కడకు మొసలిపై వచ్చి స్వయంభువుగా వెలిసింది. కెడవిక్కుల అంటే ఎప్పటికీ కొండెక్కదని అర్థం..ఇక్కడ గర్భగుడిలో వెలిగించిన దీపం ఎప్పటికీ కొండెక్కదని…అమ్మవారే స్వయంగా ఈ దీపాన్ని వెలిగించాలని చెబుతారు. ఏటా జరిగే ఉత్సవాలకు చంపక్కులం నుంచి ధ్వజం రావడం ఇక్కడ సంప్రదాయం..కేరళ పాలకుల్లో అగ్రవీరుల్లో ఒకరైన రాజా మార్తాండవర్మ ఇక్కడకు వచ్చి అమ్మవారిని ఆరాధించి అక్కడే ఓ భవంతిని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
మొక్కులు చెల్లించుకునే విధానం
అమ్మవారికి మొక్కుకున్న భక్తులు తమ కోరికలు తీరిన అనంతరం ఇత్తడి గంటలను ఇవ్వడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో మర్రిచెట్టు కొమ్మలకు ఈ గంటలు కడతారు. నెలకు దాదాపు 4 లక్షల గంటలు కడతారు..అంటే అంతమంది కోరిన కోర్కెలను అమ్మవారు నెరవేర్చిందని దానివెనుకున్న ఆంతర్యం. అసలు మర్రిచెట్టు అని కూడా తెలియనంతగా గంటలతో నిండిపోయిఉంటుంది. గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం బయటున్న మర్రిచెట్టు చుట్టూ ఏడు ప్రదిక్షిణలు చేసి గంటలు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. గంటలు కట్టే ఆచారం ఎప్పటినుంచి మొదలైందంటే… ఓ సారి ఆలయ ధ్వజస్తంభం నుంచి ఓ గంట కిందకు పడిపోయింది. అర్చకుల్లో ఒకరు దాన్ని తీసుకుని మర్రిచెట్టు కొమ్మకు కట్టారు. అనంతరం ఆయన జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయట. దీంతో గంటలు కట్టే సంప్రదాయం అప్పటి నుంచి ప్రారంభమైంది.
ట్రైన్లో అయితే కొల్లాం, విమానంలో అయినా కొల్లాం సమీపంలో ఉన్న తిరువనంతపురం చేరుకుంటే అక్కడి నుంచి ఆలయానికి వెళ్లడం ఈజీ అవుతుంది.
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..