కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలను ఆవిష్కరించాయి. బీజేపీకి అనుకోని పరాజయం ఎదురైతే, కాంగ్రెస్ ను అనుకున్నదాని కంటే ఎక్కువ సీట్లతో విజయం ఖాయమైంది. 110 సీట్లు వస్తే గొప్ప అని ఎదురు చూసిన హస్తం పార్టీకి ఏకంగా 135 స్థానాలు వచ్చి చేరాయి. అంత జరిగినా, ఎంత ఓడినా బీజేపీకి ఒక ఫలితం మాత్రం స్వాంతన మాత్రమే కాకుండా అమితానందాన్ని కూడా ఇస్తోంది. బెంగళూరులో పార్టీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలదు. నగర జనం కమలానికే జై కొట్టారు..
పెరిగిన 5 శాతం ఓట్లు
రాజధాని నగరంలో బీజేపీ ఓట్ షేర్ ఐదు శాతం పెరిగిందని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. బ్రాండ్ బెంగళురు దెబ్బతిన్నదని, గతేడాది వచ్చిన వరదలతో బెంగళూరు మునిగిపోవడంతో జనం ఆగ్రహంగా ఉన్నారని, పట్టణ మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినా సగటు బెంగళూరు వాసి మాత్రం కమలనాథులనే నమ్ముకున్నాడు. పైగా 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే బెంగళూరు ప్రాంతంలో ఆ పార్టీకి ఒక సీటు ఎక్కువగా వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది
ప్రజాగ్రహానికి గురికాకూడదని వరదల్లో మునిగిన మహదేవపురా టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే అరివంద్ లింబావలికి బీజేపీ అధిష్టానం కట్టబెట్టలేకపోయింది. ఆయన భార్యను ఎన్నికల బరిలోకి దించింది. ఆ సీటుపై బీజేపీ ఆశలు వదలుకున్నప్పటికీ జనం బీజేపీని 45 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. 2018లో మహదేవపురా సీటును బీజేపీ 18 వేల మెజార్టీతోనే గెలిచింది. మరో పక్క నగరంలోని గాంధీ నగర్లో పోటీ చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు కేవలం 105 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బెంగళూరులో బీజేపీకి, కాంగ్రెస్ కు ఉన్న తేడా అదే..
మోదీ రోడ్ షోతో అడ్వాంటేజ్
ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోతో బెంగళూరు వాసుల్లో తమ పట్ల విశ్వాసం పెరిగిందని బీజేపీ విశ్వసిస్తోంది. రోడ్ షోకు నేల ఈనినట్లుగా వచ్చిన జనమే అందుకు నిదర్శనమని చెప్పుకుంటోంది. కాకపోతే అధికార పార్టీలకే ఎక్కువ మంది ఓటే వేసే బెంగళూరు వాసుల ఆలోచనా విధానం కూడా బీజేపీకి కలిసొచ్చింది. ఈ సారి బెంగళూరులో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది మూడు సార్లకు పైగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వారే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి మారిన నలుగురు కూడా ఈ సారి గెలవడం విశేషం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగని నేపథ్యంలో ఎమ్మెల్యేలే అన్ని పనులు చూసుకుంటున్నారు.
టికెట్ల పంపిణీలో అడ్జెస్ట్ మెంట్ ?
పార్టీల టికెట్ల పంపిణీలో కొంత మేర అడ్జెస్ట్ మెంట్ ఉందని కూడా చెబుతున్నారు. గెలిచే నియోజకవర్గాలకు లెక్కబెట్టుకుని మిగతా చోట్ల వీక్ కేండేట్స్ ను పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలహీనమైన అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారని వార్తలున్నాయి. వీటన్నింటికీ మించి బెంగళూరు ఓటరు బీజేపీ వైపు కమిట్ అయి చాలా రోజులైంది. నగర పరిధిలోని మూడు లోక్ సభా స్థానాలను 2008 నుంచి బీజేపీ మాత్రమే గెలుస్తోంది. నగరం జీవనం దుర్భరమవుతోందని వాదించే టెకీలే.. నమ్మకంగా బీజేపీకి ఓటేస్తున్నారు.
ఒక్కళిగలకు ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో బీజేపీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో దాని ప్రభావం బెంగళుురుపై పడింది. పైగా ఈ సారి కాంగ్రెస్ కు గ్రామీణ ఓటర్లు ఏకమొత్తంలో ఓటు వేయడం వల్ల ఆ పార్టీ గెలిచింది. పట్టణ ప్రాంతా ఓటర్లు బీజేపీ పక్షం వహించడంతో బెంగళూరులో కమలం జయభేరీ మోగించింది. పైగా బెంగళూరులో 90 శాతం మంది మధ్య తరగతి ఓటర్లేనని మరిచిపోకూడదు..